21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరం : ప్రధాని మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 7:25 AM GMT
21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరం : ప్రధాని మోదీ

21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరమని.. అందుకే జాతీయ విద్యావిధానంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ నూతన విద్యావిధానంలో సంస్కరణలపై నిర్వహించిన సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలన్నారు. నూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని తెలిపారు. అనేక మందితో చర్చలు జరిపిన అనంతరం జాతీయ విద్యావిధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. ఈ విద్యా విధానం పై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే అంత మంచిదన్నారు. కొత్త విద్యా విధానంతో విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని.. 30 ఏళ్ల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానం తీసుకువస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరారు.

నర్సరీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో సమూల మార్పులను చేశామని తెలిపారు. గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారత సాధించలేదని, నిశిత పరిశీలన ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. ఏం ఆలోచిస్తున్నారనే దాని నుంచి ఎలా ఆలోచిస్తున్నారనే దానిపైనే దృష్టి సారించాలన్నారు. పిల్లలు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువుకు వెసులు బాటు కల్పించామన్నారు. నూతన విధానంలో పిల్లల మనో వికాసం మరింత వృద్ది చెందుతుందన్నారు. విద్యార్ధులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పారు. కొత్త విద్యా విధానంతో విద్యార్ధులు తమకు నచ్చిన కోర్సులను చదువుకోవచ్చునని అన్నారు.

Next Story