అమ్మ బాబోయ్ అమ్మోనియం నైట్రేట్.. చెన్నైలో 697 టన్నులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 1:07 AM GMT
అమ్మ బాబోయ్ అమ్మోనియం నైట్రేట్.. చెన్నైలో 697 టన్నులు..!

అమ్మోనియం నైట్రేట్.. ఆ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. అందుకు కారణం లెబనాన్ రాజధాని బీరూట్ లో చోటుచేసుకున్న విధ్వంసమే..! నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ ను అమ్మేద్దామని అక్కడి అధికారులు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ భారీ విధ్వంసం చోటుచేసుకుంది. అందుకే వివిధ దేశాలు అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై నిఘా పెట్టేశాయి. అవి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాయి.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కంటైనర్ కేంద్రంలో 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయట. దీంతో అధికారులు అమ్మోనియం నైట్రేట్ ను వేలం వేయాలని నిర్ణయించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుండి 2015లో ఈ అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. తాను దిగుమతి చేసుకున్న రసాయనం వ్యవసాయ రంగంలో ఎరువుగా ఉపయోగించేదని ఆ వ్యక్తి చెబుతున్నా అధికారుల తనిఖీల్లో అది పేలుడు పదార్థం స్థాయిలో ఉందని, వ్యవసాయిక ఎరువు కంటే దాని తీవ్రత అధికంగా ఉందని తేలింది. 1.80 కోట్ల విలువైన ఆ అమ్మోనియం నైట్రేట్ ను అధికారులు జప్తు చేశారు. చెన్నైలో ఉన్న 697 టన్నుల్లో 7 టన్నులు అప్పటి వరదల్లో దెబ్బతినగా, మిగిలిన 690 టన్నులను ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

లెబనాన్ రాజధానిలో జరిగిన విధ్వంసం కారణంగా చెన్నై అధికార వర్గాలు మేల్కొన్నాయి. పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ కేంద్ర విభాగం దేశవ్యాప్తంగా గోదాములు, పోర్టుల్లో ఉన్న రసాయన నిల్వలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని నివేదికలు అందాయి. 48 గంటల్లో వాటి పరిస్థితి సమీక్షించాలని అధికారులను ఆదేశించింది.

లెబనాన్ రాజధానిలో విధ్వంసానికి కారణం ఓ గోడౌన్ లో నిల్వ ఉంచిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడమే..! 2013 లో రష్యాకు చెందిన కార్గోలో ఈ అమ్మోనియం నైట్రేట్ బీరూట్ కు చేరింది. బీరూట్ లోని హ్యాంగర్ 12లో ఈ అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ ఉంచారు.

కస్టమ్స్ అధికారులు ఆ అమ్మోనియం నైట్రేట్ ను డిస్పోజ్ చేయడానికై మూడేళ్ళుగా అధికారులకు లెటర్లు రాసిన రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లు మూడు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, లెబనీస్ ఆర్మీకి అందించడం, లెబనీస్ కు చెందిన ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు అమ్మేయాలని సలహాలు ఇచ్చారు. అయినా పట్టించుకోలేదు అధికారులు.

వాసన లేని స్ఫటికాకారపు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ ను ఫెర్టిలైజర్ గా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా పరిశ్రమల్లో పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ కారణమని చెబుతూ ఉన్నారు. ఇంధన చమురుతో కలవడం వలన అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థంగా మారుతూ ఉంటుంది. తాలిబన్లు కూడా ఈ పేలుడు పదార్థాలను ఉపయోగించే వారు. ప్యూరిటీ కలిగిన అమ్మోనియం నైట్రేట్ పేలడం చాలా అరుదు. ఇతర పదార్థాలతో కలిపినప్పుడే పేలుడు అన్నది సంభవిస్తూ ఉంటుంది.

Next Story