140 సంవత్సరాల డ్రైనేజీ సిస్టమ్.. ముంబైలో మార్పులు రావాల్సిందే.. లేకుంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 8:38 AM GMT
140 సంవత్సరాల డ్రైనేజీ సిస్టమ్.. ముంబైలో మార్పులు రావాల్సిందే.. లేకుంటే..!

ముంబైను గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూ వచ్చాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.

ముంబై నగరాన్ని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. గురువారం ఉదయానికి వర్షం తీవ్రత కాస్త తగ్గింది. చాలా ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజా రవాణా అస్తవ్యస్థమైంది. బుధవారం నాడు దక్షిణ ముంబైలో భారీ వర్షం పడింది. ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు పారవేసేందుకు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. వడాలా లోని బిపిటి కాలనీ, సెంట్రల్ ముంబై లోని నాయర్ ఆసుపత్రి పాత్రం, మహర్షి కర్వే రోడ్, సక్కర్ పంచాయతీ ప్రాంతం ఇంకా నీటి దిగ్భందంలోనే ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మాహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొల్హాపూర్ జిల్లాలోని పంచగంగ నదిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. కొల్హాపూర్ జిల్లాలో వరద ప్రమాదం పొంచి ఉండడంతో 4000 మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారు. నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఆ ప్రాంతాల్లోకి అధికారులు పంపించారు. లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేశారు.

ముంబై నగరంలో ఎప్పుడు చూసినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి. 46 సంవత్సరాలలో ఆగష్టు నెలలో ఎప్పుడూ చూడని వర్షాన్ని బుధవారం నాడు ముంబై నగరం చూసింది. 293.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. పాత డ్రైనేజీ సిస్టం, ఓపెన్ స్పేస్ లను ఆక్రమించి ఇల్లు కట్టడమే అందుకు కారణమని తెలుపుతూ ఇప్పటికే పలువురు నిపుణులు చెబుతూ వచ్చారు. ముంబై డ్రైనేజీ సిస్టం వయసు 140 సంవత్సరాలు.. అది కూడా బ్రిటీష్ ప్రభుత్వం తీర్చిదిద్దినది. ఆ సమయంలో నగరం మొత్తం పచ్చగా ఉండేది. 50 శాతం వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా వెళ్ళిపోయిన మిగిలిన వర్షపునీరు భూమి లోకి ఇంకి పోయేలా రూపొందించారు.

ఇప్పుడు దక్షిణ ముంబై ప్రాంతంలో చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అన్నది ఇంకా అలాగే ఉందని ఎన్విరాన్మెంటలిస్ట్స్ లు తెలిపారు. పాత డ్రైనేజీ సిస్టమ్, చెరువులను, పలు ప్రాంతాలను కబ్జా చేయడం కారణంగా నీరు అన్నది ఇంకిపోవడం లేదు.. దీంతో లోతట్టు ప్రాంతాలన్నవి జలమయం అవుతూనే ఉన్నాయి. బుధవారం నాడు తొమ్మిది గంటలపాటూ కురిసిన భారీ వర్షం 225 మిల్లీ మీటర్లుగా నమోదయ్యింది. 1974లో ఆ ప్రాంతం ఈ స్థాయిలో వర్షం కురిసిందని ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. చర్చ్ గేట్, మెరైన్ డ్రైవ్, ఫోర్ట్, గిర్గామ్, ఖేట్వాడీ, జెజె మార్గ్, గోల్ డియోల్, బెండీ బజార్, కల్బాదేవీ లాంటి ప్రాంతాలు జలమయమయ్యాయి.

వాతావరణంలో వచ్చే మార్పుల ఆధారంగా కూడా నగరంలోనూ, నగరం లోని ప్రజల లోనూ మార్పులు రావాలని యుడిఆర్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ జోషి తెలిపారు. 'కొందరు వాతావరణంలో మార్పులు వచ్చాయి అంటే నమ్మడం లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 25 ఎంఎం నుండి 50 ఎంఎం నీటికి మాత్రమే ప్రస్తుతమున్న డ్రైనేజీ నెట్వర్క్ పని చేస్తుంది. 280 ఎంఎంను ఇప్పుడున్న డ్రైనేజీ తట్టుకోలేదు. సిటీ డ్రైనేజీ సిస్టమ్ లో మార్పులు రావాల్సిందే.. లేకుంటే రాబోయే రోజుల్లో వచ్చే ఉపద్రవాలను తట్టుకోవడం కష్టమే' అని అన్నారు.

Next Story
Share it