బెంగళూరు మరో బ్రెజిల్‌లా మారే అవకాశముందన్న మాజీ ముఖ్యమంత్రి.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 2:41 PM GMT
బెంగళూరు మరో బ్రెజిల్‌లా మారే అవకాశముందన్న మాజీ ముఖ్యమంత్రి.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?

బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు నగరంలో మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నాలుగు ప్రాంతాలను సీల్ చేశామని కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు చెప్పారు. కేసులు ఇదే విధంగా పెరిగితే బెంగళూరులో లాక్ డౌన్ విధిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పతో మాట్లాడతానని.. పూర్తీ లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

జనతా దళ్(సెక్కులర్) నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరులో పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు మరో బ్రెజిల్ లా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇంకో 20 రోజులు బెంగళూరులో లాక్ డౌన్ ను అమలు చేయాలని కోరారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయాలని కోరారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని.. ఎకానమీ కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికిప్పుడు బెంగళూరులో 20 రోజుల పాటూ లాక్ డౌన్ ను అమలుచేయాలని ఆయన ట్వీట్ చేశారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ ను అమలు చేస్తామంటే కరోనాను కట్టడి చేయడం కుదరదని ఆయన అన్నారు. పేదలకు ఉచితంగా రేషన్ ను పంపిణీ చేసినంత మాత్రాన వారి కష్టాలు తీరవని.. రాష్ట్రంలోని 50 లక్షల మంది శ్రామికులకు 5000 రూపాయల చెప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రైవర్లకు, నేతన్నలకు, శ్రామికులకు ఈ ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడం లేదని ఆరోపణలు చేశారు.

కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులు:

కర్ణాటక హెల్త్ మినిస్ట్రీ లెక్కల ఆధారణంగా ఇప్పటి వరకూ కర్ణాటకలో 9150 కేసులు నమోదయ్యాయి. 3395 కేసులు యాక్టివ్ గా ఉండగా, 5618 కేసులు డిశ్చార్జ్ అయ్యారు. 137 మంది మరణించారు. బెంగళూరు నగరంలో 196 తాజా కేసులు నమోదవ్వడంతో మరోసారి లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ పెరుగుతూ ఉంది.

Next Story