జూమ్ యాప్‌లో బైబిల్ క్లాసులు.. సడెన్‌గా బూతు వీడియోలతో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 May 2020 8:20 PM IST
కరోనా వైరస్ కారణంగా దాదాపుగా ప్రపంచమంతా లాక్‌డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో.. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి వద్ద నుండే పనులు చేసుకోవాలని పురమాయించగా.. ఆన్‌లైన్ కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీని కారణంగా వీడియో కాలింగ్ యాప్ అయిన జూమ్ యాప్‌ను తెగ వాడేస్తున్నారు.
ఈ వీడియో కాలింగ్ యాప్.. ఒకేసారి చాలా మంది వ్యక్తులు సదరు సంస్థల యొక్క కార్యకలాపాలు సమన్వయం చేసేందుకు వీలుగా ఉండటంతో యాప్ వాడకం ఎక్కవైంది. అయితే ఈ విషయమై భారత్.. జూమ్ యాప్ లో భద్రతాపరమైన లోపాలున్నాయని హెచ్చరించింది. భారత్ హెచ్చరించినట్టుగానే ఆ లోపాలు నిజమేనని నిరూపిస్తూ.. ఓ హ్యాకర్ రెచ్చిపోయాడు.
వివరాళ్లోకెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్‌లో బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. క్లాసుల నిర్వహణకు అనువుగా వుంటుందని చర్చి యాజమాన్యం జూమ్ యాప్‌ను వినియోగించింది. అయితే.. మే 6న బైబిల్ క్లాసులు జరుగుతుండగా.. ఓ హ్యాకర్ మధ్యలోకి వచ్చి బూతు వీడియోలతో హల్‌చల్ చేశాడు. అప్పటివరకు భక్తితో బైబిల్ అధ్యయనం చేస్తున్న వారు.. సడన్‌గా ఏర్పడ్డ అంతరాయంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.
దీనిపై చర్చి యాజమాన్యం.. జూమ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. బైబిల్ అధ్యయనం చేస్తున్నవారిలో ఎక్కువగా వృద్ధులుండటంతో ఈ హఠాత్త్ పరిణామం.. వారిని తీవ్రంగా బాధించిందని పేర్కొంది. దీనిపై స్పందించిన జూమ్ యాజమాన్యం.. ఆ హ్యాకర్ గురించి తమకు గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపి చేతులు దులుపుకుంది. దీంతో చర్చి యాజమాన్యం చేసేదేం లేక.. జూమ్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు మెట్టెక్కింది.