పెళ్లి పేరుతో మోసం.. రూ.12లక్షలు పోగొట్టుకున్న యువతి
By Newsmeter.Network Published on 15 May 2020 4:17 PM IST
ఆన్‌లైన్‌లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు మొత్తుకున్నా.. ప్రతినిత్యం అవగాహన కల్పిస్తున్నా పలువురు మోసపోతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి, కాస్ట్‌లీ నగల పేరుతో రూ. 12లక్షలు దోచుకెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన యువతికి ఆన్‌లైన్‌లో హ్యారీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ మ్యాట్రిమనీ సైట్‌లో యువతి వివరాలు చూసి సంప్రదించాడు. అలా కొద్దిరోజులపాటు ఆన్‌లైన్‌లో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. వీరి మధ్య స్నేహబంధం ఏర్పడటంతో నేరుగా ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించారు. అలా కొద్దికాలానికి వీరిద్దరి మనస్సులు కలిశాయి. హ్యారీ యువతికి ప్రేమిస్తున్నట్లు, పెళ్లిచేసు కోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో యువతికూడా పెళ్లిచేసుకొనేందుకు ఇష్టమేనని తెలపడంతో వారి మధ్య ప్రేమబంధం కొద్దిరోజులు కొనసాగింది.
Also Read : కరోనా నుండి కోలుకొని వచ్చిన మహిళకు గ్రామస్తుల ఘనస్వాగతం
ఓ రోజు హ్యారీ యువతికి ఫోన్‌చేసి నీకోసం ఖరీదైన బంగారం గొలుసు, బంగారు వాచి, నెక్లెస్ కొంటున్నానని, వాటికి సంబంధించిన ఫొటోలను యువతికి వాట్సాప్ చేశాడు. హ్యారీ తనపై చూపుతున్న ప్రేమకు యువతి ఆనందం వ్యక్తం చేసింది. వెంటనే వీటిని కొరియర్ ద్వారా పంపిస్తానని, తీసుకోమని హ్యారీ యువతికి చెప్పాడు. రెండురోజులకే మీకు కొరియర్ వచ్చింది, ఖరీదైన నగలు వచ్చాయి, వాటిని పొందాలంటే కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 12లక్షలు చెల్లించాలని కోరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని, లాక్‌డౌన్ ఉండటంతో నేరుగా ఇంటికే మీ కొరియర్‌ను పంపిస్తామని ఫోన్‌లో వ్యక్తి తెలిపాడు. దీంతో మూడు దఫాలుగా రూ. 12లక్షలను యువతి ఆన్‌లైన్‌లో చెల్లించింది. నగదు చెల్లించినప్పటికీ తనకు రావాల్సిన కొరియర్ రాకపోవటంతో యువతి ఫోన్ చేసింది. కొరియర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ స్విచ్‌ఆఫ్ ఉండటంతో కంగారుపడ్డ యువతి హ్యారీకి ఫోన్‌చేసింది. హ్యారీ ఫోన్‌కూడా స్వచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గుర్తించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read :బిగ్గరగా మాట్లాడటం ద్వారానూ వైరస్ వేగంగా వ్యాప్తి..!