ఈ మాస్కులు వాడుతున్నారా.. జర జాగ్రత్త..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2020 1:39 PM ISTఒకప్పుడు మాస్కుల కొరత ఉండేదేమో కానీ.. ఇప్పుడు మార్కెట్ లోకి ఎన్నో రకాల మాస్కులు వచ్చేశాయి. ఎవరికి నచ్చే విధంగా.. నప్పే విధంగా ఉండే మాస్కులను కొనుక్కుంటూ ఉన్నారు. ముఖ్యంగా మాస్కులలో వాల్వ్ ఉన్న మాస్కులు మార్కెట్ లో లభిస్తూ ఉన్నాయి. అద్దాలు ఉన్న వారు ఈ మాస్కులను ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ వాల్వ్ ఉన్న మాస్కుల వలన పెద్ద ప్రయోజనం లేదని తాజాగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేస్తూ ఈ మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆరోగ్య కార్యకర్తలు కాకుండా ఇతరులు కవాటాలతో ఉన్న ఈ ఎన్-95 మాస్కులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడాన్ని తాము గమనించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మాస్కులు కరోనా వైరస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేవని డైరెక్టర్ జెనెరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. వైరస్ అన్నది ఈ కవాటాల ద్వారా మనిషి శరీరం లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్కులను కాకుండా పూర్తిగా కప్పి ఉంచే మాస్కులను వాడడం ఎంతో శ్రేయస్కరమని అధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని ఏప్రిల్ నెలలో ప్రభుత్వం సూచనలు చేసింది. ఇంట్లో తయారు చేసినవైనా పర్లేదని.. ముఖాన్ని కప్పి ఉంచే విధంగా ఉండే మాస్కులను బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచించారు. మాస్క్ కోసం వాడే వస్త్రం ఏదైనప్పటికీ తప్పనిసరిగా మాస్కులను అయిదు నిమిషాల పాటూ వేడి నీటిలో ఉంచాలని.. పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే మాస్కులను వాడాలని తెలిపారు. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులైనా.. ముఖం మీద పూర్తిగా పట్టేలా చేయడమే కాకుండా.. ఎటువంటి గ్యాప్ ఉండకుండా చూడాలని తెలిపారు. మాస్కులను వేసుకునే ముందు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. మాస్కును ఇతరులతో పంచుకోకూడదని.. కుటుంబ సభ్యులైనా ఎవరికి వారు ప్రత్యేకమైనవి తెచ్చుకోవాలని అన్నారు అడ్వైజరీ కమిటీ సభ్యులు.
మాస్కులు తప్పనిసరిగా వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సూచనలు జారీ చేశాయి. ఎవరైతే మాస్కులు వాడకుండా ఉంటారో వారికి ఫైన్స్ కూడా విధిస్తూ ఉన్నారు. చాలా వరకూ మాస్కులు కరోనా సోకకుండా అడ్డుకుంటున్నాయని పలు సర్వేలలో తెలిసింది.
భారత్‌లో కరోనా కేసులు గత 24 గంటల్లో 37,148 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,395 శాంపిళ్లను పరీక్షించారు. 587 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 11,55,191కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 28,084కి పెరిగింది. 4,02,529 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,24,578 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం 1,43,81,303 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.