కరోనాతో 'ఢీ' కొడతారా..అయితే ఇవి పాటించండి

By సుభాష్  Published on  21 July 2020 7:28 AM GMT
కరోనాతో ఢీ కొడతారా..అయితే ఇవి పాటించండి

అధిక జనాభా ఉంటోన్న పెద్ద పెద్ద నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. దాంతో ఉన్న రోగులకే ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్న కొన్ని ఆస్పత్రులు కొత్త రోగులను చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో పాటు వెంటిలేటర్ల కొరత కూడా ఉంటుంది కానీ..ఈ విషయాన్ని ఆయా ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడం లేదు. అసలు కరోనా రోగి కోలుకునేందుకు కావాల్సింది రోగనిరోధక శక్తి..దానితో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉండటం. కానీ నగరాల్లో నివశించే జనాభాలో 80 శాతం మందికి డి విటమిన్ లోపం ఉన్నట్లు ఇటీవలే చేసిన ఒక పరిశోధనలో తేటతెల్లమైందంటున్నారు వైద్యులు. అసలు డి విటమిన్ లోపం ఎందుకు పెరిగింది ? తిరిగి ఆ లోపాన్ని సమతుల్యం చేయాలంటే ఏం తినాలి ? ఎలా ఉండాలి ?

కరోనా పుణ్యమా అని ప్రజలు చాలా వరకూ ఇళ్లకే పరిమితయ్యారు. ఉద్యోగాలు, రోజువారి పనులకు వెళ్లే వారు మినహా మిగతా వారు అత్యవసరమైతేనే బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారిలో కూడా చాలా మంది ఇంటి నుంచి పనంతా చేసేస్తున్నారు. దాంతో సూర్య కిరణాలు శరీరంపై పడే రోజులే లేకుండా పోయాయి. తెల్లగా ఉన్న వారు వారంలో 2-3 రోజులు 20 నుంచి 25 నిమిషాల పాటు ఉదయాన్నే ఎండలో ఉండాలని, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు వారంలో 2-3 రోజులు 35-40 నిమిషాల పాటు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అలాగే కొవ్వు ఎక్కువగా ఉన్న చేపలు తినడం ద్వారా కూడా డి విటమిన్ ను సంపాదించుకోవచ్చని తెలిపారు.

శరీరంలో డి విటమిన్ పుష్కలంగా ఉంటే కరోనా వైరస్ ను ఢీ కొట్టచ్చని చెప్తున్నారు. కరోనాను అధిగమించడంలో డి విటమిన్ పాత్ర చాలా కీలకమట. ఇప్పుడు కరోనా వచ్చిందని ఇవన్నీ చెప్తున్నారు కానీ..ఏడాదికి ఒక్కసారైనా విటమిన్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అప్పుడే కదా శరీరంలో ఏ విటమమిన్ లోపముందో ఎవరికైనా తెలిసేది.

Next Story