కేంద్రం కొత్త రూల్.. కల్తీ వస్తువులకు యావజ్జీవం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 5:45 AM GMT
కేంద్రం కొత్త రూల్.. కల్తీ వస్తువులకు యావజ్జీవం

వస్తువు ఏదైనా సరే కేరాఫ్ కల్తీగా మార్చేస్తున్న ఉదంతాల్ని ఇప్పటికే చూస్తున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ కల్తీ వస్తువుల తయారీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కఠినమైన చట్టాల అవసరాన్ని కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం 1986 స్థానంలో తాజాగా 2019 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

దీని ప్రకారం కల్తీ చేసే వారికి కఠినమైన చర్యల్ని తీసుకోనున్నారు. మోసపూరిత ప్రకటనలతో మాయ చేసే వారికి షాకులు తప్పవు. కొత్త చట్టంలో ఈ కామర్స్ సంస్థలకు ముకుతాడు వేయటంతో పాటు.. తేడా చేస్తే భారీగా జరిమానాలు.. శిక్షలు పడేలా చట్టాన్ని రూపొందించారు.

ఈ కామర్స్ సంస్థలు.. తాము అమ్మే వస్తువు ఏ దేశం తయారీ చేసిందన్న సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు.. వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల్ని నలభై ఎనిమిది గంటల్లో ధ్రువీకరణ పత్రం ఇవ్వటంతో పాటు.. నెల రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం అమల్లోకి వచ్చిన శిక్షలు.. జరిమానాలు భారీగా ఉండనున్నాయి.

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన జిల్లా.. రాష్ట్ర.. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్లు జారీ చేసే ఉత్తర్వుల్ని అమలు చేయని వారికి కనీసం నెల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించటమే కాదు.. రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ వేసే వీలుంది. అంతేకాదు.. వినియోగదారుల హక్కుల సంస్థ తమ ఆధ్వర్యంలోని నిఘా విభాగంతో విచారణ జరిపి.. అందులో వ్యాపారులు.. తయారీదారులు తప్పు చేసినట్లుగా తేలితే.. వారికి ఆర్నెల్ల జైలుశిక్ష.. రూ.20లక్షల జరిమానా విధించే వీలుంది.

తప్పుడు ప్రకటనలతో మోసపుచ్చే వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. రూ.లక్ష వరకు జరిమానా విధించే వీలుంది. చేసిన తప్పునే పదే పదే చేస్తుంటే వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష.. రూ.50 లక్షల వరకు జరిమానా విధించే వీలుంది. కల్తీ వస్తువుల్ని అమ్మిన వారికి ఆర్నెల్ల జైలుశిక్ష.. రూ.లక్ష ఫైన్ ఉంటుంది. అదే సమయంలో కల్తీ వస్తువుల కారణంగా గాయాలైన పక్షంలో.. వస్తువుల్ని అమ్మిన వారికి ఏడాది వరకు జైలు.. రూ.3లక్షల వరకు ఫైన్ విధిస్తారు. అదే సమయంలో తీవ్ర గాయాలు అయితే మాత్రం ఏడేళ్ల జైలు.. రూ.5లక్షల ఫైన్ వేస్తారు. ఒకవేళ కల్తీ కారణంగా మరణిస్తే మాత్రం అందుకు బాద్యులైన వారికి ఏడేళ్ల నుంచి జీవితఖైదు విధిస్తారు. రూ.10లక్షలు తగ్గకుండా ఫైన్ విధించే వీలుంది.

Next Story