వ‌చ్చేస్తున్నాయ్.. ముప్పు త‌ప్పించే మూడు టీకాలు.!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  21 July 2020 4:57 AM GMT
వ‌చ్చేస్తున్నాయ్.. ముప్పు త‌ప్పించే మూడు టీకాలు.!

రోజూ తెల్లార‌గానే టీవీల్లోనూ, పేప‌ర్లోనూ, సోష‌ల్ మీడియాల్లోనూ ఊర్లోనూ ఇంటి చుట్టు ప‌క్క‌ల క‌రోనా బాధితుల గురించి చేదు వార్త‌లు వినీ వినీ ఠారెత్తిపోతున్న ప్ర‌జ‌ల‌కు తొలిసారిగా ఓ తీపి క‌బురు. అక్స్ ఫ‌ర్ఢ్ లోనూ, ర‌ష్యాలోనూ, భార‌త్ లోనూ క‌రోనా విరుగుడు కోసం చేస్తున్న వ్యాక్సిన్ ప్ర‌యోగాలు ఓ కొలిక్కి వ‌చ్చేస్తున్నాయి. అన్నీ కుదిరితే ఆగ‌స్టులో వాక్సిన్ లు మార్కెట్ లో క‌నిపించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటున్నాయి. ఒక్క‌సారి బ‌ల‌మైన నిరోధ‌క టీకా లేదా మాత్ర‌లు వ‌చ్చేస్తే క‌రోనా వ్యాప్తిని సులువుగా అరిక‌ట్టేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత కొన్ని నెల‌ల‌కే ప‌రిస్థితి మామూలు స్థితికి వ‌చ్చేస్తుంది. మ‌ళ్లీ శుభ‌కార్యాలు, కార్యాల‌యాల్లో కొలువులు, షాపింగ్ మాల్స్ , థియేట‌ర్ల‌లో జ‌న‌సందోహాలు, స‌భ‌లు, స‌మావేశాలు ఇలా ప్ర‌పంచం క‌రోనా ముందున్న స్థితికి చేరుకుంటుంది. ఇది కల‌లా అనిపించినా ఈరోజు కాక‌పోయినా రేపైనా కొన్ని నెల‌ల త‌ర్వాత అయినా మ‌నం త‌ప్ప‌కుండా చూసే దృశ్యాలే! ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల ప‌రిస్థితి భాగ‌వ‌తంలో వెయ్యేళ్లు మొస‌లితో భీక‌రంగా పోరాడి అల‌సిపోయిన గ‌జేంద్రుడి లెక్క ఉంది. మ‌న‌కు వాక్సినే విష్ణుమూర్తి.. దాని కోస‌మే లావొక్కింత‌యు లేదు ధైర్యంబు విలోలంబ‌య్యే.. అంటూ వేడుకోవల‌సిందే. స‌రే ఇంత‌కూ ఈ వాక్సిన్ల ప‌రిశోధ‌న తీరు తెన్నుల పై ఓ లుక్కేద్దామా..

ఆక్స్ ఫ‌ర్డ్ వాక్సిన్ తొలి ప్ర‌యోగాలు స‌క్సెస్

ఆక్స్ ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం తీవ్ర‌కృషితో అభివృద్ధి చేసిన టీకా క్లీనిక‌ల్ ప‌రీక్ష‌లు విజ‌య‌వంత‌మైన‌ట్లు శాస్త్రవేత్త‌లు ప్ర‌క‌టించింది. ఈ టీకా ప్ర‌యోగంలో బ‌ల‌మైన రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఉత్ప‌న్న‌మైన‌ట్లు శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. లాన్సెట్ ప‌త్రిక‌లో ఈ ప్ర‌యోగ వివ‌రాల‌ను ప్ర‌చురించారు. సీహెచ్ ఏడీఓ ఎక్స్ ఎన్‌కోవ్-19 పేరిట క్లినిక‌ల్ గా ప్ర‌యోగించిన‌ ఈ టీకావ‌ల్ల మొద‌టి రెండో ద‌శ‌ల్లో దుష్ప‌రిణామాలేవీ కాన‌రాలేద‌ని శాస్త్రవేత్త షోలార్డ్ తెలిపారు. గ‌త ఏప్రిల్ మే నెల‌ల్లో బ్రిట‌న్ లోని అయిదు ఆస్ప‌త్రుల్లో దాదాపు 1077 మంది ఆరోగ్య‌వంతుల‌పై ఈ టీకాను ప్ర‌యోగించారు. వారిలో బ‌ల‌మైన రోగ‌నిరోధ‌క ప్ర‌తిస్పంద‌న ఉన్న‌ట్లు కొనుగొన్నారు. ఈ వైర‌స్ నుంచి కాపాడ‌గ‌లిగే టీసెల్స్ ఉత్ప‌త్తి అయిన‌ట్లు గుర్తించారు. ఈ టీకా రెండు డోసులు తీసుకున్న రోగుల్లో నిరోధ‌క శ‌క్తి చాలా బ‌లంగా ఉంది. అయితే మ‌నుషులపై ఈ టీకాల ప్ర‌యోగం ఇంకా జోరుగా కొన‌సాగించాల్సి ఉంది. అదే స‌మ‌యంలో టీకాను ఇంకా అభివృద్ధి చేయాలి. ఇందుకోసం వైర‌స్ పై పూర్తి అవ‌గాహ‌న రావాల్సి ఉంది. మ‌నుషుల‌పై ప్ర‌యోగాల‌ను కొన‌సాగిస్తూనే మ‌రోవైపు భారీ స్థాయిలో ఉత్ప‌త్తి చేసి పంపిణీ ప్రారంభించేందుకు బ్రిట‌న్ కు చెందిన అస్ట్రా జెనెకాతో చేతులు క‌లిపిన విషయం తెలిసిందే. అలాగే అక్స్ ఫ‌ర్డ్ టీకాను భార‌త్ లో ప‌రీక్షించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

సై అంటున్న ర‌ష్యా

ఈ టీకాల అభివృద్ధిలో అగ్ర‌రాజ్యం అమెరికా మొద‌లు చాలా దేశాలు పోటీ ప‌డుతున్నాయి. ఎవ‌రు ఈ వైర‌స్ రేస్ లో ముందుంటారో అన్న ఆస‌క్తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొంది. ఇదులో ర‌ష్యా మొద‌ట్నుంచీ ఉత్సాహంగా ప‌రుగులు తీస్తోంది. త‌ను అభివృద్ధి చేసి విజ‌య‌వంతంగా ప్ర‌యోగాల ద‌శ‌ను పూర్తి చేసుకున్న టీకాను వ‌చ్చే నెల మొద‌ట్లోనే మార్కెట్ లో తేవాల‌ని నిశ్చ‌యించిన‌ట్లు తాజా స‌మాచారం. ర‌ష్యా టీకాపై ప్ర‌యోగాలు నిన్న‌టితో ముగిశాయి. రెండో విడ‌త‌గా పాల్గొన్న 20 మంది వ‌లంటీర్ల‌ను సైనిక్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ప‌రిశోధ‌న ఇంకా కొన‌సాగించాల్సి ఉన్న‌ప్ప‌టికీ టీకా స‌మ‌ర్థ‌త‌పై ఎలాంటి అనుమానాలు లేవ‌ని ర‌ష్యా కేంద్రీయ శాస్త్ర ప‌రిశోధ‌న సంస్థ హెడ్ సెర్గెయ్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మూడోద‌శ ప్ర‌యోగాలు చేస్తూనే స‌మాంత‌రంగా ఉత్ప‌త్తి ప్రారంభిస్తున్న‌ట్లు ర‌ష్యా ఆరోగ్య‌మంత్రి ఆశావ‌హంగా తెలిపారు. ఈ ఏడాది 3కోట్ల డోసులు ర‌ష్యా ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌ద‌ని అధికారులు వివ‌రించారు. ఈ వాక్సిన్ కు ఆధికారికంగా ఆమోద ముద్ర ప‌డ‌క‌ముందే ర‌ష్యా దిగ్గ‌జ వ్యాపారులు, రాజ‌కీయ నేత‌లు దీన్ని వేయించుకున్న‌ట్లు తెలుస్తోంది.

వేగంగా భార‌త్ కోవాగ్జిన్ ప‌రీక్ష‌

భాగ్య‌న‌గ‌రానికి చెందిన భార‌త్ బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ వృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ టీకా పై క్లీనిక‌ల్ ప‌రీక్ష‌లు ఊపందుకున్నాయి. హైద‌రాబాద్, ఢిల్లీ,చెన్నై న‌గ‌రాల్లో కొంద‌రు వలంటీర్ల‌కు ఈ టీకాలు వేశారు. దీంతోపాటు భువ‌నేశ్వ‌ర్, వైజాగ్ ల‌లో కూడా ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. న‌గ‌రంలోని నిమ్స్ లో సోమ‌వారం ఇద్ద‌రు వాలంటీర్ల‌కు కోవాగ్జిన్ టీకా ఇచ్చారు. వీరిని అబ్జ‌ర్వేష‌న్ కింద ఐసీయూలో ఉంచారు. ఒక రోజు త‌ర్వాత ఇంటికి పంపినా 14 రోజుల‌పాటు వీరిని అనేక విధాలుగా మానిట‌ర్ చేస్తునే ఉంటారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ న‌మూనాలు ప‌రీక్షిస్తారు. రోగాన్ని నిరోధించే యాంటీబాడీలు ఏమేర‌కు ఉత్ప‌త్తి అవుతున్న‌యో ప‌రిశీలిస్తారు. ఫ‌లితాలు స‌రిగా ఉంటే రెండోద‌శ ప్రారంభిస్తారు. మంగ‌ళ‌వారం మ‌రో ఇద్ద‌రికి వాక్సిన్ ఇవ్వ‌నున్నారు. ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్ లో కోవాగ్జిన్ టీకా ట్ర‌య‌ల్స్ ల్యాబ్ షురూ చేశారు. వచ్చేవారం ఇక్క‌డ ప్ర‌యోగాలు మొద‌ల‌వుతాయి. ఇవ‌న్నీ ద‌శ‌లు విజ‌య‌వంతంగా పూర్త‌యితే కొత్త సంవ‌త్స‌రం ప్రారంభంలో కోవాగ్జిన్ మార్కెట్లో క‌నిపించ‌నుంది.

ఇవ‌న్నీ చూస్తుంటే త్వ‌ర‌లో ఏదో ఒక శుభ‌వార్త క‌చ్చితంగా విన‌బోతున్నామ‌న్న పాజిటివ్ వైబ్స్ మ‌న‌ల్ని తాకుతాయి. దేశం ఏదైనా ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా.. ఇప్పుడు ప్ర‌పంచంలో అంద‌రికీ కావ‌ల్సింది ఓ టీకా.. అంతే! ఓ చిన్న‌వైర‌స్ మ‌న బ‌తుకుల్ని ఆగ‌మాగం చేస్తుంటే ఇంకా ఎంత కాలం ఇలా చూస్తూ ఉండాలి? శాస్త్రవేత్త‌లారా త్వ‌ర‌ప‌డండి.. మేలైన వాక్సిన్ క‌నిపెట్టండి.. ప్ర‌పంచాన్ని ర‌క్షించండి.. శుభం భూయాత్!!

Next Story