ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ఊరట కలిగించే విషయమే..!

By సుభాష్  Published on  21 July 2020 3:08 AM GMT
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ఊరట కలిగించే విషయమే..!

భారతదేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కరోనా కట్టడి చేయలేకపోతూ ఉన్నారు. అందుకే 10 లక్షల మార్కును ఎంతో తొందరగా అందుకుంది భారత్. ఓ విషయం మాత్రం మనకు ఎంతో ఊరట కలిగిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పందిస్తూ కరోనా మరణాల రేటు 2.5 శాతం దిగువకు పడిపోయిందని తెలిపింది. కంటెయిన్మెంట్‌ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం, పెద్దసంఖ్యలో టెస్టులు నిర్వహించడం, మెరుగైన చికిత్సా విధానాలతో దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేట్లు భారత్ లో నమోదయ్యాయి. భారత్‌లో కరోనా మరణాల రేటు క్రమంగా దిగివస్తూ ప్రస్తుతం 2.49 శాతానికి చేరింది.

కరోనా వైరస్ సోకడం వలన చాలా దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది.. కానీ భారత్ లో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా వ్యాధి సోకే ప్రమాదమున్న వృద్ధులు, గర్భిణులు, ఇతర వ్యాధులు కలిగిన వారిని గుర్తిస్తూ ఉండడమే కరోనా మరణాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరికైతే కరోనా సోకడం వలన మరణించే ప్రమాదం ఉంటుందో వారిని ముందే గుర్తించి చికిత్స అందించడంతో మరణాల రేటు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అమెరికా, బ్రెజిల్‌, రష్యా, పెరూ, చిలీ, మెక్సికో, దక్షిణాప్రికా, బ్రిటన్‌, పాకిస్తాన్‌, స్పెయిన్‌ వంటి దేశాలు కలిపి భారత్‌లో కోవిడ్‌ 19 కేసుల కంటే 8 రెట్లు అధికంగా కేసులు నమోదు చేశాయని.. భారత్‌లో మరణాల రేటు కంటే ఈ దేశాల్లో మరణాల రేటు 14 రెట్లు అధికమమని స్పష్టం చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గాలి అంటే వ్యాక్సిన్ రావడం ఒక్కటే మార్గమని అంటున్నారు నిపుణులు.

కొన్ని దేశాలు తక్కువ జనాభా ఉండడం, ముందే ఇతర దేశాలకు చెందిన వాళ్ళను అనుమతించకపోవడంతో కరోనా అన్నదే లేకుండా చేయగలిగారు ఆయా దేశాల అధికారులు. ఉత్తర కొరియా, నౌరు, తుర్క్ మెనిస్థాన్, సమోవా, కిరిబాటి, టోంగా, సోలోమన్ ఐలాండ్స్, వనెవాటు, మైక్రోనేషియా దీవుల సమాఖ్య, మార్షల్ దీవులు, పలావ్, తువాలు లాంటి దేశాలలో కరోనా కేసులు లేవని తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది. కరోనా ప్రభావం మొదలైన సమయంలోనే చాలా దేశాలు పలు ఆంక్షలు విధించడంతో ఆయా దేశాలు ఇప్పుడు కరోనా ఫ్రీ దేశాలయ్యాయి.

Next Story
Share it