కరోనా అంతిమ సంస్కారాలపై కేంద్రం తాజా మార్గదర్శకాలు తెలుసా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2020 9:26 AM GMTకరోనాతో మరణించిన వారి నుంచి వైరస్ సోకదన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మహమ్మారి విషయంలో మొదట్నించి ఫాలో అవుతున్న విధానాల నేపథ్యంలో పలు అపోహలు నెలకొన్నాయి. దీనికి తోడు అధికారులు సైతం డెడ్ బాడీల్ని ఇచ్చే విషయంలో అనుసరిస్తున్న విధానంతో చాలానే అనుమానాలు.. సందేహాలు ఉన్నాయి.
గడిచిన కొద్దిరోజులుగా కరోనా డెడ్ బాడీ నుంచి వైరస్ సోకే అవకాశం లేదన్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ దాని మీద అవగాహన లేని కారణంగా చాలానే ఇబ్బందులకు గురవుతున్నాయి.
ఈ అంశంపై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కరోనా మృతదేహలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పొచ్చు. అయితే.. ఇందుకు అనుసరించాల్సిన జాగ్రత్తల్ని.. విధివిధానాల్ని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఏమేం అంశాలు ఉన్నాయన్నది తెలుసుకోవటం చాలా అవసరం.
- కరోనా మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి జరగదు.
- ఆసుపత్రుల్లో వైరస్ కారణంగా మరణించిన మృతదేహాన్ని ప్రత్యేక జాగ్రత్తలతో బ్యాగులో భద్రపరచాలి. అంతేకాదు.. వీటిని తరలించే వారికి తప్పనిసరిగా పీపీఈ కిట్లు ఇవ్వాలి
- చికిత్స సమయంలో ఉపయోగించిన గొట్టాలు.. సిరంజీలను మృతదేహం నుంచి తొలగించాలి
- మృతదేహంపై ఏమైనా గాయాలు.. రంధ్రాలు ఉంటే.. వాటిని హైపోక్లోరైట్ తో క్రిమిసంహారకం చేయాలి
- శరీరం నుంచి వచ్చే ద్రవాల లీకేజిని నివారించటానికి వీలుగా నోరు.. ముక్కులను దూదితో మూసివేయాలి
- మృతదేహాన్ని లీక్ ఫ్రూప్ ప్లాస్టిక్ బాడీ బ్యాగ్ లో ఉంచాలి. బ్యాగ్ పై భాగాన్ని హైపోక్లోరైట్ తో శుభ్రం చేయాలి
- మృతదేహాన్ని రవాణా చేసే వాహనాల్ని హైపోక్లోరైట్ ద్రావణంతో సరిగా క్రిమిసంహారం చేయాలి
- డెడ్ బాడీని వెహికిల్ లో నుంచి తీసిన తర్వాత చాంబర్ డోర్.. హ్యాండిల్స్.. ప్లోర్ ను అదే ద్రావణంతో శుభ్రం చేయాలి
- మృతదేహాను తీసుకెళ్లే సిబ్బంది తప్పనిసరిగా సర్జికల్ మాస్కులు.. గ్లవ్స్ ను ధరించాలి
- కరోనా మృతదేహాలకు శవపరీక్షలు చేయకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో చేయవలసి వస్తే వారు పీపీఈ కిట్లు ధరించాలి.
- శవపరీక్ష్ ప్రక్రియ ముగిశాక ప్రత్యేక బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచాలి. దాని పైభాగాన సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచి మృతదేహాన్ని బంధువులకు అప్పగించవచ్చు.
- కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారి మనోభావాల్ని గౌరవించాలి
- కుటుంబ సభ్యులు.. బంధువులు మృతదేహాన్ని చూడటానికి.. తమ మతపరమైన ఆచారాల్ని పాటించటం.. పవిత్ర జలం చల్లుకోవటానికి అనుమతి ఇవ్వొచ్చు. శరీరాన్ని తాకకుండా ఎలాంటి మతపరమైన ఆచారాల్ని అయినా అనుమతించొచ్చు
- మృతదేహానికి స్నానం చేయించటం.. మీద పడి ముద్దు పెట్టటం.. కౌగిలించుకోవటం లాంటివి చేయకూడదు
- కరోనా మృతదేహాంతో ఎలాంటి అదనపు ప్రమాదం ఉండదని శ్మశాన సిబ్బంది గ్రహించాలి
- అంత్యక్రియలు పూర్తి అయ్యాక కుటుంబ సభ్యులు చేతుల్ని శుభ్రపర్చుకోవాలి
- దహన ప్రక్రియ తర్వాత వచ్చే బూడిద ఎలాంటి ప్రమాదం కలిగించదు. చివరి కర్మలు చేయటానికి వీటిని సేకరించుకోవచ్చు
- శ్మశాన వాటికలో భారీగా జనసమీకరణ చేయటం సరికాదు. ఎందుకంటే.. దీని వల్ల వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుంది.