కరోనా తాజా స్పీడ్ ఎంతో తెలుసా? సెకనుకు 9 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 5:50 AM GMT
కరోనా తాజా స్పీడ్ ఎంతో తెలుసా? సెకనుకు 9 కేసులు

అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి తీరు చూస్తే.. నోట మాట రాదంతే. అక్కడెక్కడెక్క చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ మాయదారి రోగం.. ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. దాని తీవ్రత అంతకంతకూ విస్తరిస్తోంది. తాజగా నమోదైన గణాంకాలు చూస్తే.. షాకింగ్ గా మారాయి. ఒకప్పుడు లక్ష కేసులు అంటే.. ప్రపంచవ్యాప్తంగానే కొన్ని రోజులుపట్టేది. అలాంటిది ఇప్పుడు ఆ దూకుడు మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా నమోదవుతున్న కరోనా కేసుల లెక్కల ప్రకారం.. ఒక సెకను గడిచే సమయానికి ఏకంగా తొమ్మిది మంది వైరస్ బారిన పడుతున్నట్లుగా లెక్క తేల్చారు. ఈ అంకె విన్నంతనే ఒళ్లు జలదరించేలా ఉండటమేకాదు.. కరోనా ముప్పు అంతకంతకూ విస్తరిస్తుందన్న విషయంపై స్పష్టతను తీసుకొస్తోంది.

నెల క్రితం ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్ష కేసులు నమోదు కాగా.. తర్వాత రోజుల్లో రెండు లక్షలకు చేరుకున్నాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మరణాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులో ప్రపంచ వ్యాప్తంగా మూడులక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. అందులో అమెరికా..భారత్.. బ్రెజిల్.. మెక్సికో దేశాలు అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయి. రోజువారీగా నమోదయ్యే కేసుల్లో భారత్ టాప్ లోకి దూసుకెళ్లింది.

లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు కావటమే కాదు.. రోజువారీగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా 7.52లక్షల మంది మరణించారు. అధికారికంగా విడుదల చేస్తున్న సమచారం ప్రకారం రోజుకు దగ్గర దగ్గర మూడున్నర వేల మంది మరణిస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ అంకె మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు. ఒక్క భారత్ లోనే వెయ్యికి మరణాలు అధికారికంగా నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 48వేలకు పైనే ఉన్నారు. మరణాల్లో మొదటి స్థానం మహారాష్ట్ర నిలువగా.. తర్వాతి స్థానాల్లో తమిళనాడు.. ఏపీ నిలవటం గమనార్హం.

దేశంలో పాజిటివ్ కేసుల నమోదు మహారాష్ట్ర..తమిళనాడు.. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మొన్నటివరకు పదివేలకు తగ్గకుండా నమోదయ్యే ఏపీలో.. ఇప్పుడు కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. చైనాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని చెబుతున్నారు. కొత్తగా 30 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇక.. ప్రపంచంలో కరోనా ఫ్రీ ఉన్న దేశాలుగా చెబుతున్న న్యూజిలాండ్ దేశంలోనూ.. తాజాగా 13 కేసులు నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తుంది. మొత్తంగా కన్ను మూసి తెరిచే స్వల్ప సమయంలో తొమ్మిది కేసులు నమోదవుతున్న తీరు చూస్తే.. ఈ మాయదారి రోగం వేగం ఎంతన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Next Story
Share it