ఆర్జీవీకి షాక్.. ఆ సినిమా పోస్టర్లపై భారీ జరిమానా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 July 2020 4:43 PM IST
ఆర్జీవీకి షాక్.. ఆ సినిమా పోస్టర్లపై భారీ జరిమానా

హైద‌రాబాద్ : టాలీవుడ్‌ దర్శకుడు రాంగోపాల్ వర్మకి గ‌ట్టి షాక్ త‌గిలింది. అనుమతి లేకుండా పవర్ స్టార్ సినిమా పోస్టర్లు పెట్టడంపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ జరిమానా విధించింది. ఆర్జీవీ ప‌వ‌ర్ స్టార్ సినిమాకు సంబంధించి నగర వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లు ఏర్పాటు చేశారు.

అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీఆర్ఎఫ్ బృందాల తనిఖీలలో ఏ ఒక్క దానికి అనుమతి తీసుకోలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో తమకు అందిన ఫిర్యాదుల మేరకు అనుమతి లేని పోస్టర్లకు 31 చ‌లాన్లు విధిస్తూ.. మొత్తం 84,000 రూపాయల జరిమానా విధించింది. జ‌రిమానాకు సంబంధించి ఈవీడీఎం డిపార్ట్‌మెంట్ నుంచి ఆర్జీవీ టీం నోటీసులు అందుకున్నారు.

ఇదిలావుంటే.. ఇటీవలే జీహెచ్ఎంసీ కూడా పవర్ స్టార్ పోస్టర్లపై 4000 రూపాయల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్‌ను పోస్ట్ చేసినందుకు వర్మపై జీహెచ్‌ఎంసీకి చెందిన ఈవీడీఎం విభాగం రూ .4 వేల జరిమానా విధించింది. ఈ విష‌య‌మై జీహెచ్‌ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్.. రామ్ గోపాల్ వర్మకు సమన్లు కూడా ​​జారీ చేసింది.

లాక్‌డౌన్ తర్వాత ఇది మొదటి పోస్టర్ అని పవర్‌స్టార్ మూవీ గురించి ఆర్జీవీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌పై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆస్తిని ఉపయోగించినందుకు వర్మకు రూ. 4 వేలు ఈవీడీఎం విభాగం జరిమానా విధించింది.

Next Story