ఖర్చుకు రెఢీ అన్నప్పుడు.. ఆ పని చేస్తే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 July 2020 1:06 PM ISTకరోనా ఎపిసోడ్ తొలిదశలో ఎంత పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకున్నారో.. అందుకు భిన్నంగా ఇప్పుడు విమర్శలకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారటమే కాదు.. కరోనా విషయాన్ని ఎలా డీల్ చేయాలో చెప్పే విషయానికి కేసీఆర్ ను ఉదాహరణగా చూపించిన ఉదంతాలెన్నో. అలాంటి ఆయన.. ఇటీవల కాలంలో కరోనాను పూర్తిగా వదిలేశారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు.
అంతకంతకూ పెరుగుతున్న కేసుల వేళ.. నిర్దారించే పరీక్షలు పెద్ద ఎత్తున చేయించాలన్న డిమాండ్ ను పట్టించుకోని పరిస్థితి. ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులకు ఓకే అన్నాక ఒక్కసారిగా పెరిగిన కేసుల సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. అంతేనా? ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స దోపిడీ.. బెడ్ల కోసం అదే పనిగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావటం.. అంత్యక్రియల కోసం పడుతున్న తిప్పలు లాంటి అంశాలపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కరోనా విషయంలో ముఖానికి మాస్కు కట్టుకోకుండా పని చేస్తామని.. అందరిని ఆదుకుంటామని తరచూ చెప్పే కేసీఆర్.. ఖర్చు విషయంలోనూ చాలానే మాటలు చెప్పారు. అవసరమైతే రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టటానికైనా సిద్ధమేనని.. ప్రజల్ని ఆదుకుంటామని చెప్పారు. ఖర్చుకు వెనకాడమని తరచూ చెప్పే కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అంతకు మించిన రిలీఫ్ ప్రజలకు ఏముంటుంది?
విదేశాల్లో మాదిరి.. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్ని ప్రభుత్వమే నిర్వహణ తీసుకొని.. వారికి వైద్య సేవల్ని అందించే పని చేస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా? ఖర్చుకు వెనుకాడేది లేనప్పుడు.. కొర్పారేట్ దోపిడికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వమే సొంతంగా రంగంలోకి దిగితే సరిపోతుంది. మరి.. ఆ పని చేయకుండా పరిస్థితి అదుపులో ఉందని చెప్పటంలో అర్థం లేదు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించని ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పే కేసీఆర్.. ఇప్పటివరకూ అలాంటి చర్య ఏ ఒక్కరి మీదా ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న తలెత్తక మానదు.