ఏపీ హైకోర్టులో నాలుగు కీలక పిటిషన్లపై విచారణ
By అంజి Published on 6 Feb 2020 9:06 AM IST
అమరావతి: ఇవాళ హైకోర్టులో నాలుగు కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, సీఎం జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. గత సంవత్సరం సరిగ్గా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రణరంగం ముందున్నవేళ పులివెందులలో వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగింది. అది కూడా అత్యంత నాటకీయ ఫక్కీలో. ఇంట్లో నిద్రపోతున్న వై.ఎస్.వివేకా దారుణమైన హత్యకు గురయ్యారని అందరూ గుర్తించారు.
ఏపీలో పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని ఖండిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏకంగా స్మశాన వాటికల గోడలకు సైతం వైసీపీ రంగులు రుద్దారు. పంచాయతీ ఎన్నికలు సమీపస్తున్న వేళ.. కార్యాలయాలపై రంగులు తొలగించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇవాళ విచారణ కొనసాగనుంది.
ఈడీబీ ఎక్స్ సీఈవో ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ నిధుల దుర్వినియోగం చేసిన సీబీఐ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కృష్ణా కిషోర్ నిధులు దుర్వినియోగం చేసినట్లు సీఐడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. హైకోర్టులో ఆధారాలు సమర్పించి.. కృష్ణా కిషోర్‌ను విచారణ కోసం సీఐడీ కస్టడీ కోరే అవకాశాలున్నాయి.
ఏపీలో స్థానిక ఎన్నికల జీవో 176ను నిలుపుదల చేయాలంటూ కర్నూలుకు చెందిన ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలుపై సుప్రీం అభ్యంతరాలుండటంతో 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా, 50 శాతానికే పరిమితం చేయాలా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని అనే అంశాలపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.