FactCheck : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో ట్యాక్సీని ఎక్కారా..?

Pictures of PM Modi Boarding a Taxi in Italy are Morphed. భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2021 3:01 PM GMT
FactCheck : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో ట్యాక్సీని ఎక్కారా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే..! కోవిడ్ -19, ప్రపంచ ఆర్థిక మరియు ఆరోగ్య పునరుద్ధరణ, స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులపై చర్చల కోసం జి 20 సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ రోమ్‌ను సందర్శించారు.

ఈ నేపథ్యంలో నల్లటి ఫోక్స్‌వ్యాగన్ కారు నుంచి మోదీ దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోదీని ఎయిర్‌పోర్టు నుంచి తీసుకెళ్లేందుకు ఇటలీ ప్రభుత్వం కారును కూడా ఇవ్వలేదని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో మోదీ ట్యాక్సీ ఎక్కాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

నంబర్ ప్లేట్‌పై 'లా ప్రైమా యాప్ ఇన్ ఇటాలియా పర్ ఐ టాక్సీ' అని రాసి ఉన్న నీలిరంగు బోర్డు, బోర్డు మీద itTaxi - క్యాబ్ సర్వీస్ యాప్ - చిహ్నం ఉంది. "విమానాశ్రయం నుండి పికప్ చేయడానికి ఇటాలియన్ ప్రభుత్వం కారును కూడా పంపలేదు" అనే టెక్స్ట్‌తో కూడిన చిత్రాలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఒరిజినల్ ఫోటోలను మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

వైరల్ అవుతున్న ఫోటోలను తీసుకుని NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి అసలు చిత్రాలను కనుగొంది. ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) అక్టోబర్ 30, 2021న రెండు చిత్రాలను ట్వీట్ చేసింది. మోదీ వాటికన్ సిటీని సందర్శించి పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. ఆయన రాక సందర్భంగా తీసిన చిత్రాలు, తిరిగి వెళ్తున్న సమయంలో కొన్ని చిత్రాలను తీశారు. ఆ ఫోటోలలో ఎక్కడా కూడా మోదీ వెళ్లిన వాహనాలకు ట్యాక్సీ అనే సింబల్ లేనే లేదు.

న్యూస్ మీటర్ వైరల్ ఫోటోలను, ఒరిజినల్ ఫోటోలను పోల్చి చూసింది. ట్యాక్సీ బోర్డులను పక్కాగా కావాలనే కొందరు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు స్పష్టమవుతోంది.


కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Next Story