రోడ్డు పక్కన ఓ గుంత పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన కార్యకర్తలు బాగా ఉన్న రోడ్లపై గుంతలు తవ్వుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు మంచి రోడ్లను తవ్వి, ఫొటోలు తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారని.. రోడ్లపై గుంతలు తవ్వి.. జనసేన కార్యకర్తలు #GoodMorningCMSir' అనే క్యాప్షన్‌తో ట్రెండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి.. 21 జూన్ 2022 నాటి ది హిందూ ప్రచురించిన నివేదికలో అదే చిత్రాన్ని కనుగొంది. కర్నాటకలోని షిమోగా జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని హొన్నెతాలు నివాసితులు రోడ్డు పక్కన కూర్చున్నట్లు ఆ కథనం తెలుపుతోంది. ప్రభుత్వం రోడ్డు వేసినప్పటికీ.. నిర్మాణ పనులు సరిగా జరగలేదని ఆరోపించారు.
తమ గ్రామాన్ని దుర్గాపరమేశ్వరి ఆలయానికి కలిపే రోడ్డు పనులు నాసిరకంగా జరిగిందని, రోడ్డు వేసిన నెలరోజుల్లోనే గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపించారు.
ఇదే విషయాన్ని కర్ణాటక రాష్ట్రంలోని మీడియా సంస్థ 'విజయ కర్ణాటక' కూడా నివేదించింది. కొత్త రోడ్లు వేసిన మూడు నెలల్లోనే కొత్తగా వేసిన టార్మాక్ అరిగిపోయిందని తీర్థహళ్లి వాసులు ఫిర్యాదు చేస్తున్నట్టు చిత్రంలో చూపించినట్లు కథనం స్పష్టంగా పేర్కొంది.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంచి రోడ్లపై గుంతలు తవ్వుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన కార్యకర్తలకు వ్యతిరేకంగా ఈ పోస్టులను పెడుతూ ఉన్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎలాంటి నిజం లేదు'.