హైదరాబాద్ డాక్టర్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును తీసేయించిన కర్ణాటక ప్రభుత్వం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 July 2020 1:27 PM IST
హైదరాబాద్ డాక్టర్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును తీసేయించిన కర్ణాటక ప్రభుత్వం..!

కరోనా వైరస్ ఓ వైపు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ వుంటే.. మరో వైపు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. కొందరు తమకు తోచిన పోస్టులు పెడుతూ కరోనా వైరస్ పారద్రోలండి అని చెబుతూ ఉన్నారు. కోవిద్-19 కు ఇంకా వ్యాక్సిన్ రాకపోయినా ఇంకొందరు వచ్చేసింది అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఏదో ఒక తప్పుడు వార్తను వైరల్ చేయాలనే దురుద్దేశంతో సోషల్ మీడియాను వాడుకుంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిలో రోజుకు ఎన్నో పోస్టులు అలాంటివి పడుతూ ఉండగా.. ఆ సంస్థల యాజమాన్యం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంది.

తాజాగా ఫేస్ బుక్ హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టును డిలీట్ చేసింది. కోవిద్-19 ట్రీట్మెంట్ కు తీసుకోవాల్సిన మందుల జాబితా అంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం పేస్ బుక్ కు రిక్వెస్ట్ చేయడంతో దాన్ని డిలీట్ చేసింది. ఇలాంటి సమయాల్లో అలాంటి పోస్టుల ద్వారా 'మిస్ లీడింగ్ మెడికల్ అడ్వైజ్' ను ఇచ్చినట్లేనని అంటున్నారు.

అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ కార్డియాలజిస్ట్ సంజీవ్ కుమార్ జులై 8న పెట్టిన పోస్టును డిలీట్ చేశామని తెలిపింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు రాతపూర్వక అభ్యర్థన వచ్చిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంజీవ్ కుమార్ వీడియోను పోస్ట్ చేయడమే కాకుండా 11 మందుల పేర్లను కూడా తెలిపాడు. ఆసుపత్రుల్లో బెడ్ లు పొందలేని వాళ్లు, చాలా అనారోగ్యంగా ఉన్న వాళ్లకు తాను చెప్పింది ఉపయోగపడుతుందని అన్నాడు. ఈ వీడియోను 4000 మందికి పైగా షేర్ చేశారు. ఎన్ని సార్లు ఆయా మందులు తీసుకోవాలో, ఎంతెంత డోస్ తీసుకోవాలో కూడా ఆ వీడియోలో చెప్పుకుంటూ వచ్చాడు.

దీనిపై కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఈ మంగళవారం నాడు ఆ వీడియోను తీసివేయాల్సిందిగా కోరుతూ ఓ లెటర్ రాసింది. ఇలా సామాజిక మాధ్యమాల్లో రోగులు తీసుకోవాల్సిన మందుల గురించి చెప్పడం ద్వారా ఎన్నో నిబంధనలను తుంగలో తొక్కినట్లు అవుతుందని తెలిపింది. 'violated existing guidelines of medical prescriptions' అంటూ వీడియోను ఫేస్ బుక్ నుండి తీసేయమని కోరడంతో ఫేస్ బుక్ ఆ పని చేసింది. 'ఈ సోషల్ మీడియా అకౌంట్ ను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నామని.. ఇలా మందుల గురించి చెప్పడం ద్వారా ప్రజలను తప్పుద్రోవ పట్టించే అవకాశం ఉండడమే కాకుండా.. ప్రజలు సొంతంగా మందులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది చాలా ప్రమాదకరం' అని కర్ణాటక రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్పెషల్ ఆఫీసర్ సురేష్ శాస్త్రి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, ప్రజలను తప్పు ద్రోవ పట్టించే పోస్టులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని ఆయన అన్నారు.

తమ సోషల్ మీడియాలో ఎటువంటి తప్పుడు సమాచారం ఉండడానికి వీలు లేదని ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జనవరి నెల నుండి తాము కోవిద్-19 కు సంబంధించి పెట్టిన ఎంతో తప్పుడు సమాచారాన్ని డిలీట్ చేసుకుంటూ వస్తున్నామని అన్నారు.

Next Story