లాక్‌డౌన్ నుంచి ఈ ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వనున్నారా..?

By సుభాష్  Published on  15 April 2020 3:04 PM IST
లాక్‌డౌన్ నుంచి ఈ ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వనున్నారా..?

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించింది కేంద్రం. కరోనా తగ్గుతుందనుకుంటే మర్కజ్‌ ఉదాంతం తర్వాత ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. దేశంలో ఇప్పటి వరకు 11వేల కేసులు నమోదయ్యాయి. అందులో 9756 మంది యాక్టివ్‌గా ఉండగా, 1305 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ మే 3 వరకకు లాక్‌డౌన్‌ పొడిగించారు. కాగా, ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో పొడిగింపు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే దేశంలో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు 350 వరకూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఆ జిల్లాలను గ్రీన్‌ జోన్‌లుగా ప్రకటించి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం లేని జిల్లాలు.. ఏపీ నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలుండగా, తెలంగాణ నుంచి మంచిర్యాల, వనపర్తి, నారాయణపేట, వరంగల్‌ (రూరల్‌), యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. ప్రధాని చెప్పినదాని ప్రకారం చూస్తూ ఈ జిల్లాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, ములుగు, నాగర్‌కర్నూలు జగిత్యాల తదితర జిల్లాలో ఒకటి నుంచి రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అవి కూడా మార్చిలో నమోదైనవే. ఏప్రిల్‌ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ ప్రాంతాలకు కూడా మినహాయింపు జాబితాలో చేర్చే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వస్తే ఏఏ ప్రాంతాలకు మినహాయింపు ఇస్తారో తేలిపోనుంది.

Next Story