హైదరాబాద్ లో ఎస్సెన్షియల్ సర్వీస్ పాస్ తెచ్చుకోవడం ఎలా..?

By సుభాష్  Published on  15 April 2020 7:06 AM GMT
హైదరాబాద్ లో ఎస్సెన్షియల్ సర్వీస్ పాస్ తెచ్చుకోవడం ఎలా..?

ఎస్సెన్షియల్ సర్వీస్ పాస్.. తాము ఏదైనా ముఖ్య పనికి వెళ్తున్నామని, లేదా తాము ప్రభుత్వం అనుమతించిన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామని తెలుపుతూ తిరగడానికి వీలు ఉంటుంది. ఆ పాస్ ను ఇది వరకూ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి తీసుకుని వచ్చేవారు.. ఇప్పుడు వెబ్సైటులోనే తీసుకునేలా వెసులుబాటును కల్పిస్తున్నారు పోలీసులు. రాచకొండ పోలీసులు ఇప్పటికే అందుకు సంబంధించిన వెబ్‌ సైట్‌ ను తయారుచేయగా.. హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా తన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇకపై పాసులను జారీ చేస్తున్నారు. ఆర్గనైజర్లు, వ్యక్తులు పాసుల కోసం పోలీసు స్టేషన్స్ చుట్టూ తిరగకుండా వెబ్‌ సైట్ల ద్వారానే రిజిస్టర్ చేసుకోవచ్చు.

స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ డి.సి.పి. ముత్యన్ రెడ్డి న్యూస్ మీటర్ తో మాట్లాడుతూ "హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఏప్రిల్ 14 లేదా 15వ తేదీ నుండి ఈ-పాస్ వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని.. ఇకపై డైరెక్ట్ గా పోలీసు స్టేషన్లకు వచ్చి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు" అని అన్నారు

రెండు రకాల ఎసెన్షియల్ పాసులు ఉంటాయని.. ఒకటి సంస్థకు, ఇంకొకటి ఒక్కో వ్యక్తికి.. "ముఖ్యమైన అవసరాల కోసం వినియోగించే వాహనాలను ముందుగానే రిజిస్టర్ చేయించాలి. సదరు వాహనాలకు చెందిన నెంబర్ లను రిజిస్టర్ చేయిస్తే సరిపోతుంది. ఇక వ్యక్తులకు సంబంధించిన పాస్ ను ఫోటో ఉపయోగించి పొందవచ్చని" తెలిపారు.

కొత్తగా లాంచ్ చేసిన వెబ్‌ సైట్‌లో సదరు వ్యక్తి అతడి పర్సనల్ డీటెయిల్స్ ను నింపాల్సి ఉంది. వాహనం నంబర్, ఎందుకు వెళుతున్నారో దానికి సంబంధించిన కారణం, ఆధార్ నెంబర్ ను సదరు వ్యక్తి పూరించాలి. ఆ అప్లికేషన్ ను పోలీసులు చూసి.. వెరిఫికేషన్ చేస్తారు.. అతడికి ఈ-పాస్ ఇవ్వాలని నిర్ణయించుకున్న పోలీసులు వెబ్సైటు లో పొందుపరుస్తారు. వెంటనే దాన్ని ప్రింట్ తీసుకుని వాడుకోవచ్చు. "తాము పాస్ ఎందుకు కావాలని కోరుతున్నారో.. వాటిని వెరిఫై చేసి చూస్తామని.. లేదంటే ప్రతి ఒక్కరూ పాస్ ల కోసం ఎగబడుతారని అన్నారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని ఈదబడే వాళ్ళు ఉంటారని.. అటువంటి వాళ్ళను చూస్తూ వదిలేయం కదా" అని అన్నారు ముత్యన్ రెడ్డి.

రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేయించుకునే వాళ్ళు, పెట్ షాప్స్ యజమానులు, పోలీసులకు సహాయం చేస్తున్న వాలంటీర్లు ఈ-పాస్ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. హైదరాబాద్ పోలీసులు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన సమాచారం కొరకు 8433958158 నెంబర్ ను ఇచ్చారు. ఈ నెంబర్ కు ఫోన్ చేరిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, భర్త లేని మహిళలకు పచారీ కొట్టులకు వెళ్లాలన్నా, మెడికల్ షాప్స్, బ్యాంకు, పోస్ట్ ఆఫీసులకు వెళ్లే వాళ్లకు తోడ్పాటును అందిస్తున్నారు. మహీంద్రా లాజిస్టిక్స్ సహాయంతో పోలీసులు ఈ సర్వీసులను చేయగలుగుతున్నారు.

Next Story