ఆర్.ఆర్.ఆర్. సినిమా గురించి సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులకు కావాల్సిన కిక్ ఇస్తూ ఉన్నాయి. ఇక సినిమా విడుదలవ్వడం ఆలస్యం అయినా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ మీద విడుదల చేసిన ఓ వీడియోపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్.. ముస్లిం టోపీ ఎలా పెట్టుకుంటారంటూ పలువురు తీవ్ర విమర్శలు చేశారు. మనోభావాలు దెబ్బతీస్తున్నారు రాజమౌళి అంటూ పలువురు ఆరోపించారు. సినిమాను విడుదలవ్వకుండా ఆపుతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై భీమ్ వారసులతో పాటు, చరిత్రకారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ అనుమానాలను నివృత్తి చేశారు రాజమౌళి తండ్రి, ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.
విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, కొమరం భీమ్ టోపీ పెట్టుకోవడానికి గల కారణాన్ని వివరించారు. భీమ్ ను పట్టుకోవడానికి నిజాం ప్రభువులు యత్నించారని, ఆయనను వెంటాడారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీమ్ ముస్లిం యువకుడిగా మారాడని, ముస్లిం టోపీ ధరించాడని చెప్పారు. సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ను పోలీసు పాత్రలో చూపించడానికి కూడా ఒక కారణం ఉందని సిల్వర్ స్క్రీన్ పై అది ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు.