2020 టాలీవుడ్‌కు పీడకలే.. విడుదలైన సినిమాలెన్నో తెలుసా.?
Tollywood 2020 Released Cinemas. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. మన సినిమా ప్రపంచాన్ని శాసించే స్థాయికి
By Medi Samrat Published on 27 Dec 2020 1:29 PM ISTతెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. మన సినిమా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఇందుకు బాహుబలి వంటి సినిమానే ఉదాహరణ. ఆ కోవలోనే ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్నాయి. సత్తా చాటుతున్నాయి. ఒక్క తెలుగులోనే ఏటా దాదాపు నూటయాభైకు పైగా స్ట్రైట్ సినిమాలు థియేటర్‌లో సందడి చేస్తున్నాయంటే.. మనవారికి సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్ అంశమనేది అర్థమవుతుంది.
అయితే.. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా కనీసం 50 సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. దీన్నిబట్టి చూస్తే.. మిగతా రంగాల కంటే కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎక్కువగా పడిందనే చెప్పాలి. మహమ్మారి దెబ్బకు ఏకంగా తొమ్మిది నెలల పాటు థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్స్ నిలిచిపోయాయి. పరిశ్రమనే నమ్ముకున్న కార్మికులు పొట్ట కూటి కోసం రోడ్డున పడ్డారు. కొన్ని చిన్న సినిమాలు ఓటీటీలలో రిలీజై కొంత ఊరటనిచ్చినా.. చాలా వరకు సినిమాలు షూటింగ్‌లు నిలిచిపోయి.. పూర్తైన సినిమాలు విడుదలకు నోచుకోక నిర్మాతల పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యింది.
గడిచిన పదేళ్లలో ఒక్కో ఏడాది రిలీజైన సినిమాల సంఖ్యతో చూస్తే.. ఈ ఏడాది మరి దారుణంగా ఉంది. కేవలం ఈ ఏడాది మొత్తంగా 49 సినిమాలు మాత్రమే థియేటర్స్‌లో సందడి చేశాయి. ఇక.. 2011లో 120 సినిమాలు థియేటర్స్‌లోకి రాగా, 2012లో 127, 2013లో 178, 2014లో 194, 2015లో 172, 2016లో 181, 2017లో 177, 2018లో 171, 2019లో 193 సినిమాలు విడుదల అయ్యాయి.
ఇక ఈ ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు సందడి చేయగా, చివరలో సోలో బ్రతుకే సోబెటర్ సినిమా విడుదలైంది. వ్యాక్సిన్ వచ్చి పరిస్థితులు బాగుంటే.. వచ్చే ఏడాదైనా సినిమాల సంఖ్య పెరిగి థియేటర్లు కళకళలాడలని ఆశిద్దాం.