తీవ్ర విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌.. శివశంకర్‌ మాస్టర్ క‌న్నుమూత‌

Shivashankar Master Passed Away. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్‌ మాస్టర్ క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on  28 Nov 2021 3:15 PM GMT
తీవ్ర విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌.. శివశంకర్‌ మాస్టర్ క‌న్నుమూత‌

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్‌ మాస్టర్ క‌న్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేఫ‌థ్యంలో శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. టాలీవుడ్, కోలివుడ్ డ్యాన్స్ మాస్టర్స్, హీరోలు, ప‌లువురు న‌టులు మాస్టర్ కుటుంబానికి సాయం కూడా చేశారు. శివశంకర్‌ మాస్టర్ మ‌ర‌ణ వార్త విన్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న కుటుంబానికి సంతాపాన్ని తెలియ‌జేశారు.

శివశంకర్‌ మాస్టర్‌ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. 1975లో 'పాట్టు భరతమమ్‌' చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన 'కురువికూడు' చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. తమిళ, తెలుగు సహా 10 భాషల్లో 800లకు పైగా చిత్రాలకు ఆయ‌న‌ నృత్యాలు సమకూర్చారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. దాదాపు 30కి పైగా చిత్రాల‌లో న‌టించి న‌టుడుగా మెప్పించారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర'లో 'ధీర ధీర' పాటకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్‌ మాస్టర్‌ ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.


Next Story
Share it