వారిని కోర్టుకు లాగనున్న సమంత
Samantha Files Defamation Case Against Youtube Channels. సమంత-నాగచైతన్య విడిపోయిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి బంధంపై
By Medi Samrat Published on 20 Oct 2021 4:53 PM ISTసమంత-నాగచైతన్య విడిపోయిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి బంధంపై ఇష్టం వచ్చినట్లు కథనాలను ప్రసారం చేశాయి. ఏవేవో కారణాలను చెబుతూ.. ఇష్టం వచ్చినట్లు వీడియోలను సృష్టించాయి. దీన్ని అప్పట్లోనే చాలా మంది తప్పు బట్టారు. వీటిపై సమంత నాగచైతన్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై సమంత అప్పట్లో రియాక్ట్ అవ్వలేదు కానీ.. ఇప్పుడు ముందుకు వచ్చింది.
తన పరువుకు భంగం కలిగించారంటూ యూట్యూబ్ ఛానళ్లపై సినీ నటి సమంత కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తెలుగు పాపులర్ టీవీ, సుమన్ టీవీలతో పాటు సీఎల్ వెంకట్రావుపై పిటిషన్ దాఖలు చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తనను కించపరిచారంటూ కూకట్ పల్లి కోర్టును ఆమె ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలను ఇవ్వాలని కోర్టును కోరారు. హీరో అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంతపై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం గురించి ఆమె కొద్దిరోజుల కిందట పోస్టు పెట్టింది.
''నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది. దయచేసిన నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయకుండా దయ చూపండి. వాళ్లు చెప్పినట్లు ఏవీ కూడా భవిష్యత్‌లో జరగవని నేను మాటిస్తున్నా'' అని సమంత ఇంతకు ముందు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
సమంత, నాగచైతన్య `ఏం మాయ చేసావె` చిత్రంతో అయిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరు హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.