పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

Rana In Pawan Kalyan Movie. కొంత‌కాలం రాజ‌కీయాల్లో బిజీగా ఉండి సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

By Medi Samrat  Published on  21 Dec 2020 7:49 AM GMT
పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

కొంత‌కాలం రాజ‌కీయాల్లో బిజీగా ఉండి సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల విష‌యంలో జోరు పెంచారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్‌గా ఈచిత్రం తెర‌కెక్కుతోంది. పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో బిజూ మీనన్ - పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో బిజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఇక తెలుగులో పృథ్వీరాజ్ రోల్ ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తాజాగా యువ న‌టుడు దగ్గుబాటి రానా.. పవన్ కళ్యాణ్ కి ధీటుగా నిలిచే పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాత్ర కోసం సుదీప్‌, విజ‌య్‌సేతుప‌తి, రానా పేర్లు వినిపించ‌గా.. చివ‌ర‌కు ఆ అవ‌కాశం రానాను వ‌రించింది. భల్లాలదేవుడుని ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో టాలీవుడ్ ప్రేక్ష‌కులు మ‌రో క్రేజీ కాంబోను చూడ‌బోతున్నారు.
Next Story