'మా' ఎన్నికల బరిలో ఆ ఇరువురు.? ఈ సారి పోరు రసవత్తరమేనా.?
Movie Artist Association Elections. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ సారి పోరు రసవత్తరంగా
By Medi Samrat Published on 21 Jun 2021 10:08 AM IST
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ సారి పోరు రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. త్వరలో జరగనున్న ఈ ఎన్నికలలో ఈ సారి మహామహులు బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికలలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేయబోతున్నాడనే వార్త వైరల్ అవుతుండగా.. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు కూడా బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రకాశ్ రాజ్ విషయానికొస్తే.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పోటీపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. టాలీవుడ్‌లో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉందని.. వాటిని పరిష్కరించడానికి పక్కా ప్రణాళిక తన వద్ద ఉందని తన సంసిద్ధతను తెలియపరిచారు. తాను 'మా' అధ్యక్షుడిని అయితే.. 100 శాతం సొంత భవనం నిర్మించి.. దేశవ్యాప్తంగా 'మా'కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు నా వంతు కృషి నేను చేస్తాను అంటూ ప్రకాష్ రాజ్ ముందుగానే హామీ ఇచ్చేశారు.
ఇక హీరో మంచు విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సివుంది. అయితే.. చిరంజీవి, మోహన్ బాబు ఫ్యామిలీలకు ఉన్న సంబంధాల నేఫథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.
అయితే.. ప్రకాశ్‌రాజ్ కూడా.. చిరంజీవి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నారా అనే ప్రశ్నకు.. చిరంజీవి అందరి వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయన ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని అనిపించిన వారికే మద్దతు ఇస్తారు. అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని దీని కోసం ఉపయోగించుకోనని బదులిచ్చారు. చిరంజీవితో ఇరువురికి మంచి సంబంధాలు ఉన్న నేఫథ్యంలో.. ఒకవేళ విష్ణు ఎన్నికల బరిలో ఉంటే.. ఎవరు 'మా' ఫీఠాన్ని దక్కించుకోనున్నారనే టెన్షన్ నెలకొంది.