మా ఎలెక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది..
MAA Election Schedule Announced. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
By Medi Samrat Published on 18 Sept 2021 5:25 PM IST
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 10 (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించి అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
'మా' ఎన్నికలల్లో ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కోసమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే 'మా' ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. ఈసారి అధ్యక్ష పదవికి పోటి చేస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీపీఎల్ నర్సింహారావు మధ్య అసలైన పోటీ జరగనుంది. ఇక మంచు విష్ణు ప్యానెల్లో 'మా' ప్రధాన కార్యదర్శిగా నటుడు రఘుబాబు పోటీపడుతున్నట్టు వెల్లడైంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో 'మా' ప్రధాన కార్యదర్శిగా జీవిత పోటీపడుతుండడం తెలిసిందే. ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి వైదొలగిన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ప్రధాన కార్యదర్శి పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.