దిల్ లేని రాజు అని అంటున్న క్రాక్ డిస్ట్రిబ్యూటర్స్

Krack Movie Distributors Fire On Dil Raju. ఇటీవలే సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చింది

By Medi Samrat  Published on  15 Jan 2021 7:51 AM GMT
దిల్ లేని రాజు అని అంటున్న క్రాక్ డిస్ట్రిబ్యూటర్స్

ఇటీవలే సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. సంక్రాంతికి మంచి సినిమాలు విడుదల అయ్యాయి. నాలుగు సినిమాల సందడి మొదలైంది. అయితే ఈ సినిమాల విషయంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రాజకీయాలు చేస్తున్నారంటూ వరంగల్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను డిస్ట్రిబ్యూట్ చేసిన 'క్రాక్' సినిమాకు సరైన థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. రవితేజ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ దీనికి థియేటర్లు తగ్గించి డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన 'మాస్టర్'కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్ రాజు పేరును 'కిల్ రాజు'గా మార్చాలని మండిపడ్డారు.

సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని గతంలో దిల్ రాజు చెప్పిన వ్యాఖ్యలను మరోసారి వినిపించిన శ్రీను.. ఇప్పుడు మాస్టర్ సినిమా విషయంలో దిల్ రాజు చేస్తున్న పనులు మాత్రం చెండాలంగా ఉన్నాయని ఆరోపించారు. అప్పుడు అలాగా.. ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. క్రాక్ సినిమాకు టాక్ బాగుందని, అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను థియేటర్ల నుంచి తీసేయడం తనను ఆవేదనకు గురిచేసిందని డిస్ట్రిబ్యూటర్ శ్రీను అన్నారు. ఎవరినీ ఎదగకుండా చేయడమే దిల్ రాజు పని అని.. ఎవరూ డబ్బులు సంపాదించుకోకూడదని.. ఎక్కడ తనకు పోటీ వస్తారోనని దిల్ రాజు భయపడుతూ ఉన్నారని శ్రీను ఆరోపణలు గుప్పించారు.




Next Story