సినీ ప్రముఖులకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన జగపతిబాబు!
Jagapathi Babu Gift to Tollywood Celebrities. రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాల
By Medi Samrat Published on 23 Jan 2021 8:06 AM IST
రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాల హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో జగపతిబాబు ఒకరని చెప్పవచ్చు. ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో మంచి విజయం అందుకున్న జగపతి బాబు సినీ పరిశ్రమలో తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రలో నటిస్తూ, విలన్ గా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.అయితే తాజాగా జగపతిబాబు సంక్రాంతి కానుకగా ప్రముఖ సినీ సెలబ్రిటీలకు సర్ ప్రైజింగ్ బహుమతిని అందజేశారు.
1971 జనవరి 13న సంక్రాంతి కానుకగా అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన దసరా బుల్లోడు చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ భారీ హిట్ చిత్రం జగపతి పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తాజాగా ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలను పూర్తిచేసుకున్న సందర్భంగా దర్శకుడు బిబి రాజేంద్రప్రసాద్ తనయుడు అయిన హీరో జగపతిబాబు సంక్రాంతి కానుకగా పలువురు సినీ ప్రముఖులకు దసరా బుల్లోడు చిత్రం ఉన్న పెన్ డ్రైవ్ తో పాటు, లెజెండ్స్ పేరుతో ఉన్న సరిగమ కారవాన్ ను బహుమతిగా అందించారు.
జగపతి బాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకుడిగా తొలి చిత్రం నాగేశ్వరరావు ఆరాధన అనే చిత్రం చేశారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితోనే" ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు,అక్కా చెల్లెలు"వంటి సినిమాలను నిర్మించారు. ఏఎన్ఆర్ ప్రోత్సాహంతోనే మెగా ఫోన్ పట్టుకోగా రాజేంద్రప్రసాద్ దసరా బుల్లోడు చిత్రాన్ని చేశారు. 50 సంవత్సరాల క్రితం సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సృష్టించింది. 39 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇరవై తొమ్మిది సెంటర్లలో అర్థ శతదినోత్సవ వేడుకలను జరుపుకుంది.