ప్రొడ్యూసర్స్ కు భారంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్యాంపెయిన్లు

How Pawan Kalyan Political Activities will cost bomb Producers. టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో మాత్రమే కాకుండా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2023 3:24 PM IST
ప్రొడ్యూసర్స్ కు భారంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్యాంపెయిన్లు

టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో మాత్రమే కాకుండా.. అత్యంత ప్రభావవంతమైన నటులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్:

పవన్ కళ్యాణ్ ఇటీవలే BRO సినిమా షూటింగ్ పూర్తి చేసారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది ఫుల్ లెంత్ రోల్ కాదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జూలై 28న విడుదల కాబోతోంది. ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టే ముందు తన రోల్ షూటింగ్ ను పవన్ కళ్యాణ్ పూర్తి చేసేసుకున్నాడు. BROతో పాటు, పవన్ కళ్యాణ్ లైనప్ లో హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమా ఒక్కో దశలో నిర్మాణం అవుతూ ఉంది.

కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి ముందు మంగళగిరిలో పూజలు చేశారు. నిర్మాతలు ఏఎం రత్నం, బీవీఎస్ఎన్ ప్రసాద్, రవిశంకర్, వివేక్ కూచిబొట్ల, దర్శకుడు హరీష్ శంకర్ ఆయనను కలిశారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. నిర్మాతలు పవన్ కళ్యాణ్‌కు అన్ని విధాలా మద్దతు ఇస్తున్నారు. మీడియాతో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. 'సినిమా షూటింగ్‌కి ఎలాగైనా భారీ సెట్‌లు వేయాల్సి ఉంటుంది. అందుకే కళ్యాణ్‌గారికి సపోర్ట్‌గా విజయవాడ పరిసర ప్రాంతాల్లో సెట్స్‌ వేస్తాం.' అని అన్నారు. ఈ నిర్ణయం నిర్మాతలకు ఎక్కువ బడ్జెట్‌ అవ్వడానికి కారణం అవుతుంది. ప్రత్యేకంగా సెట్స్ వేయడానికి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

"అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ఫ్లోర్ అద్దెకు తీసుకోవడం ఖర్చుతో కూడుకున్నది, కానీ మీరు వందలాది మందిని ఫలానా లొకేషన్‌కి తీసుకెళ్లే ఔట్‌డోర్ షూట్ ఇంకా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే. వారికి వసతి కల్పించడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీగా డబ్బు వస్తూ ఉంటుంది. కాబట్టి నిర్మాతలు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనుకాడకపోవచ్చు" అని సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పారు.

తన పార్టీని నడపడానికి, డబ్బు సంపాదించడానికే సినిమాలు తీస్తున్నానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. రోజుకు 2 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. నిర్మాతలు కూడా ఆయన అడిగినంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని గమనించాలి. పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలకు పరిమితమవ్వడం ఆయన అభిమానులకు కూడా నచ్చదు. గతంలో కొన్ని సంవత్సరాల పాటూ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైనప్పుడు అభిమానులు ఎంతో బాధపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ను సినిమాలు చేయాలని కోరారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కనిపించారు.


Next Story