ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రచ్చ సాగుతోంది. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 170కిపైగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మరో వైపు రెవెన్యూ అధికారులతో మరికొన్ని థియేటర్‌లను సీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆకస్మిక తనిఖీల పేరుతో అధికారులు థియేటర్లపై దాడులు చేస్తున్నారు. దీంతో పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆలోచనలో పడ్డారు. తాజా టికెట్ రేట్లతో థియేటర్ల నడిపించడంపై ఎగ్జిబిటర్లు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అఖండ, శ్యామ్ సింగ రాయ్, పుష్ప సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు అడియాసలయ్యాయి.
ఏపీలో థియేటర్లు మూతపడటంతో తన హృదయం బద్దలైందని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాడు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని నిఖిల్ కోరాడు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఎగ్జిబిటర్లు ఆలోచనలో పడ్డారని, మరికొందరు మాత్రం డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకు థియేటర్లు నడుపుతున్నారని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనువైన ధరలను పెట్టుకునేలా అనుమతి ఇవ్వాలని కోరాడు. ఏపీ సినిమా టికెట్ రేట్ల వివాదంపై ఇటీవల హీరో సిద్ధార్థ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.