28ఏళ్ల త‌ర్వాత‌ మెగాస్టార్‌కు క‌లిసొచ్చిన 'మే' నెల‌లో వ‌స్తోన్న 'ఆచార్య'

Chiranjeevi Acharya Movie Release In May 2021. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య. టీజర్ విడుదల చేసిన కొన్ని గంటలకే..

By Medi Samrat
Published on : 30 Jan 2021 9:19 AM IST

28ఏళ్ల త‌ర్వాత‌ మెగాస్టార్‌కు క‌లిసొచ్చిన మే నెల‌లో వ‌స్తోన్న ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య. టీజర్ విడుదల చేసిన కొన్ని గంటలకే.. ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర‌యూనిట్. మే13వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే చిరంజీవికి మే నెల బాగా క‌లిసివచ్చిందనే చెప్పాలి. 'ఖైదీ'తో చిరంజీవి స్టార్ గా మారిన తరువాత మే నెలలో ఆయన నటించిన వేట, జగదేకవీరుడు - అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు" చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో 'వేట' అపజయాన్ని చవిచూడగా.. మెకానిక్ అల్లుడు యావ‌రేజ్‌గా ఆడింది.

ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా రూపొందిన 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' చిత్రం 1990 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ తరువాత 1991లో అదే తేదీకి విడుదలైన విజయబాపినీడు 'గ్యాంగ్ లీడర్' బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. గ్యాంగ్ లీడర్ విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని సినిమా వంద రోజుల వేడుకలను సైతం వైవిద్యంగా తెలుగు చిత్రరంగానికి నెలవైన నాలుగు ప్రాంతాల్లోనూ జరిపారు.

ఆ తరువాత చిరంజీవి నటించిన 'మెకానిక్ అల్లుడు' 1993 మే 27న విడుదలైనా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచీ మళ్ళీ మే నెలలో చిరంజీవి సినిమా విడుదల కాలేదు. దాదాపు 28 సంవత్సరాల తరువాత చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' మే నెలలో జనం ముందుకు రానుంది. ఈ సారి మే 13వ తేదీ గురువారం వచ్చింది. 1991లో 'గ్యాంగ్ లీడర్' సైతం మే 9న గురువారం వచ్చింది. అలా ఈ సారి కూడా 'ఆచార్య'కు గురువారం కలసి వస్తుందని భావిస్తున్నారు.


Next Story