'అమ్మోరు తల్లి' రివ్యూ

Ammoru Thalli Movie Review. దక్షిణాదిలో అగ్ర కథానాయిక వెలుగొందుతోంది నయనతార. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం

By Medi Samrat  Published on  15 Nov 2020 7:37 AM GMT
అమ్మోరు తల్లి రివ్యూ

చిత్రం : అమ్మోరు తల్లి

న‌టీన‌టులు : నయనతార, ఆర్. జె. బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే: ఆర్. జె. బాలాజీ & టీం

డైరెక్టర్: ఆర్. జె. బాలాజీ, ఎన్. జె. శరవణన్

సంగీతం : గిరీష్ గోపాల‌కృష్ణ‌న్‌

ఎడిట‌ర్ : సెల్వ ఆర్‌.కె

నిర్మాత : కె.గ‌ణేష్

దక్షిణాదిలో అగ్ర కథానాయిక వెలుగొందుతోంది నయనతార. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మూకుత్తి అమ్మన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో అనువదించారు. నయన తార దేవత పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే ట్రైలర్ విడుదలైన తర్వాత చెలరేగిన వివాదం కూడా ఈ సినిమాని వార్తల్లో నిలిపింది. వివాదాల మధ్య దీపావళి కానుకగా నవంబర్ 14న 'అమ్మారు తల్లి' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయింది. అమ్మోరు తల్లి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ: ఏంగిల్స్ రామస్వామి( ఆర్. జె. బాలాజీ) కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అత‌డు ప‌ని చేసే ఛాన‌ల్‌కు పెద్ద‌గా గుర్తింపు ఉండ‌దు. స్థానికంగా ఉండే ఓ దొంగ‌బాబా(అజ‌య్ ఘోష్‌) చేస్తున్న 11వేల ఎక‌రాల భూ క‌బ్జాకు మీద ఆరేళ్లుగా స్టోరీ చేస్తుంటాడు. ఈ స్టోరీ క్లిక్ అయితే తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తాడు. ఇక అతడి చిన్నప్పుడే వాళ్ల తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో.. తల్లి, ముగ్గురు చెల్లెళ్ళను అన్ని తానై చూసుకుంటూ ఉంటాడు. రామ‌స్వామి త‌ల్లి అత‌డికి పెళ్లి చేయాల‌ని అనుకుంటుంది. అందుకోసం నానా అబ‌ద్దాలు చెబుతుంటుంది. అవి నిజం కాద‌ని చెప్పి వ‌చ్చిన సంబంధాల‌ను రామ‌స్వామి చెడ‌గొడుతుంటాడు.

మరోవైపు రామస్వామి తల్లి బంగారం(ఊర్వశి) ఎప్పటినుంచో తిరుపతి వెళ్లాలని అనుకుంటుంది. అయితే ఏదో ఒక ఆటంకం రావడం వల్ల అది వీలవదు. దీనితో చుట్టుప్రక్కల సలహా మేరకు.. బంగారం వాళ్లు ఇంటి దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ రామస్వామికి అమ్మవారు దర్శనమిస్తుంది. తన గుడిని తిరుపతిలా ఫేమస్ చేయాలని కోరుతుంది. అసలు అమ్మవారు ఎందుకు అలా అడిగింది.? దీనికి రామస్వామి ఒప్పుకున్నాడా.? వీరిద్దరి కథలో భగవతి బాబాపాత్ర ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దేవాలయాల నేపథ్యంలో దేవుడి మాన్యాల ఆక్రమణ, దొంగ బాబాలు వంటి కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. అయితే దేవుడు అనేది యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో ఆర్జే బాలాజీ - శరవణన్ తొలిసారి దర్శకత్వం అయినా కూడా అదే కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు. భక్తుల కోసం అమ్మవారు భూమికి దిగి రావడం.. మహిమలు చూపించి వాళ్ల కష్టాలు తీర్చడం.. భక్తి పేరుతో దొంగ బాబాలు మోసం చేయడం.. ఆశ్రమాల పేరుతో దేవుడు మాన్యాలను కాజేయడం.. చివరకు వాళ్లకు బుద్ధి చెప్పడం.. ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి. అయితే 'అమ్మోరు తల్లి' లో ఇదే అంశాలను కొంచెం కొత్తగా ఫన్నీగా చెప్పడానికి ప్రయత్నించారు. అదే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమ్మోరు తల్లిగా నయనతార మంచి అభినయాన్ని కనబరిచింది. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా దర్శకులు ఆమె పాత్రను చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. ఆమె రూపం ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇల్లు న‌డ‌ప‌డం, అవ‌స‌రాల కోసం డ‌బ్బులు దాచుకున్న విధానం లాంటి సన్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే:

మధ్య తరగతి కుర్రాడు రామస్వామిగా ఆర్. జె. బాలాజీ అద్భుతంగా నటించాడు. అమ్మవారిగా నయనతార నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు దైవత్వాన్ని ప్రదర్శిస్తూ.. ఇటు వినోదాత్మక సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించింది. దొంగ బాబాగా అజయ్ ఘోష్ అదరగొట్టాడు. అతడి మేనరిజమ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక బాలాజీ తల్లి పాత్రలో ఊర్వశి నటన బాగుంది. ఒకవైపు నలుగురి పిల్లలకు తల్లిగా.. మరోవైపు తన భర్త కోసం చాలా రోజుల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భార్యగా చక్కటి హావభావాలు పలికించింది. కొన్ని సీన్స్‌లో అయితే కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాగే మిగిలిన న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర మేర‌కు న‌టించారు. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం, దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా : బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్


Next Story