శానిటైజర్లను అతిగా వాడకండి.!
By Medi Samrat Published on 25 July 2020 6:21 PM ISTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నివారణలో బాగంగా శానిటైజర్లు, మాస్కులు కీలకంగా పనిచేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి వాడే శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ మాట్లాడుతూ.. ఇటువంటి విపత్కర పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా ఉత్పన్నమవలేదు. ఇలాంటి అసాధారణ స్వభావం ఉన్న వైరస్.. ఓ మహమ్మారి రూపం దాల్చి అతలాకుతలం చేస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. అయితే.. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్కులు ధరించండి.. తరచుగా వేడినీళ్లు తాగండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. కానీ.. శానిటైజర్లు మాత్రం ఎక్కువగా ఉపయోగించవద్దని తెలిపారు.
ఇదిలావుంటే.. గతంలో కూడా శానిటైజర్ల వాడకంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేశారు. శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే.. మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని తెలిపారు. శానిటైజర్ కాకుండా సబ్బు, నీరు ద్వారా చేతులు శుభ్రపరుచుకోవడం ఉత్తమమని తెలిపారు.