ప్రేమించలేదని మైనర్‌ను కత్తితో పొడిచిన ప్రేమోన్మాది
Tamil Nadu man stabs Class 11 girl 14 times for spurning love proposal. తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక తన ప్రేమను అంగీకరించలేదని
By Medi Samrat Published on 1 Jun 2022 7:42 PM ISTతమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక తన ప్రేమను అంగీకరించలేదని 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచాడు. ఆ బాలికను 14 సార్లు కత్తితో పొడిచాడు. ఆ వ్యక్తిని కేశవన్‌గా గుర్తించారు. తిరుచ్చిలోని అతికుళంలో నివాసముంటున్న బాలిక 11వ తరగతి చదువుతోంది. పరీక్షలు ముగించుకుని బాధితురాలు తన బంధువుల ఇంటికి వెళ్తుండగా రైల్వే ఓవర్‌పాస్ సమీపంలో నిందితుడు కేశవన్ ఆమెను అడ్డుకున్నాడు. అక్కడి నుండి కేశవన్ బాలికను వెంబడిస్తూ వచ్చాడు. జూన్ 2021లో అదే బాలికను కిడ్నాప్ చేసినందుకు కేశవన్‌పై బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం, 2012 (పోక్సో) కింద ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బాధితురాలి బంధువు పేర్కొన్నారు. అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు.
ఇటీవల ఆమె ముందుకు వచ్చి మరోసారి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. బాలిక నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. చిన్నారి సాయం కోసం కేకలు వేయకముందే కేశవన్ ఆమెను 14 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం కత్తిని అక్కడికక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిందితుడిని తిరుచ్చి పోతామెట్టుపట్టికి చెందిన కేశవన్‌గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి ట్వీట్ చేస్తూ.. ఓ పాఠశాల విద్యార్థిని 14 సార్లు కత్తిపోట్లకు గురైందని విని షాక్‌కు గురయ్యానని అన్నారు. కేశవన్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.
మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై నిందితుడు శవమై కనిపించాడు. కేశవన్ ని పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేయగా, మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు మృతదేహం దగ్గర నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేశవన్ తండ్రిని తీసుకొచ్చి మృతదేహాన్ని గుర్తించారు.