భూత వైద్యం పేరుతో హత్యాచారం.. ఆమెతో మాటలు కలిపి.. చివరకు..
Prakasam District Latest Crime News. ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను నమ్మించి అత్యాచారం
By అంజి Published on 18 Oct 2021 12:43 PM ISTప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను నమ్మించి అత్యాచారం చేయబోయాడు ఓ భూత వైద్యుడు. అందుకు ఆమె ప్రతిఘటించడంతో గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి కొట్టి చంపారు. ఈ ఘటన జరుగుమల్లి మండలంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జరుగుమల్లి మండలం కామేపల్లిలో విజయలక్ష్మి అనే మహిళ వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. పొలంలో కూలీల అవసరం ఉండడంతో.. వారిని పిలించేందుకు సాయంత్రం సమయంలో వుడ్డెపాలెం వెళ్లింది. అప్పటికే సమయం రాత్రి 8.30 అయ్యింది.
గ్రామంలో తిరుగుతూ కూలీలను పిలుస్తోంది విజయలక్ష్మీ. అదే గ్రామానికి చెందిన ఓబయ్య అనే భూత వైద్యుడు విజయలక్ష్మీని చూసి లైంగికంగా అనుభవించాలనుకున్నాడు. వెంటనే మహిళతో ఓబయ్య మాటలు కలిపాడు. తిరిగి ఓబయ్యతో మాట్లాడిన మహిళ.. తన మోకాళ్ల నొప్పుల సమస్యను చెప్పుకుంది. మోకాళ్ల నొప్పుల సమస్య తగ్గించేందుకు తన దగ్గర మందులు ఉన్నాయని, అవి ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం మహిళపై అత్యాచారయత్నం చేయబోయాడు. వెంటనే మహిళ ప్రతిఘటించింది. దీంతో విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు మహిళను కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. ఈ హత్యను తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై రజియా సుల్తానా ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుంది.
నిందితుడు ఓబయ్యను తన వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. విజయలక్ష్మీ హత్య గురించి తెలుసుకున్న కామేపల్లి గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న నిందితుడిని బయటికి లాగి మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో భూత వైద్యుదు ఓబయ్య ప్రాణాలు విడిచాడు. అడ్డుకోబోయిన ఎస్సైపై కూడా గ్రామస్తులు దాడి చేశారు. వెంటనే ఎస్సై రజియా సుల్తానా ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. ఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ, కందుకూరు డీఎస్పీలు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య, ప్రతీకార హత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహిళ జరిగిన క్షుద్ర పూజలు చేశారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మహిళ మృతదేహంపై కొంత భాగం దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. అలాగే ఓబయ్యపై దాడి చేసిన వారికి కూడా పోలీసులు విచారిస్తున్నారు.