సినిమా లోని కార్ చేజ్ సీక్వెన్స్ తలపించేలా పోలీసులు కారులో పారిపోతున్న నేరస్థులను పట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఓ వ్యాపారవేత్త యొక్క వస్తువులను దోచుకుని అతని కారులో తప్పించుకుని వెళ్లిపోతున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టేసుకున్నారు. నవంబర్ 17న నలుగురు వ్యక్తులు వ్యాపారవేత్త అయిన తంగరాజ్ వద్దకు వచ్చారు. అతను రియాక్ట్ అయ్యేలోపు ఆ ముఠా అతని మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కొని అతని మారుతీ కారులో పరారయ్యారు. తంగరాజ్ థాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు హైవే పోలీసులకు సమాచారం అందించారు.
పొల్లాచ్చి తిప్పంపట్టి సమీపంలోని వాహన చెక్‌పోస్టు వద్ద దొంగల వాహనం కనిపించింది. అయితే పోలీసులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా ఆ ముఠా బారికేడ్లను తప్పించుకుని వేగంగా వెళ్లిపోయింది. కారును వెంబడించిన పోలీసులు దొంగలు వెళుతున్న వాహనాన్ని అనుసరించారు.. పోలీసుల నుండి తప్పించుకోవడానికి దొంగలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు ఆ ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. నిందితులను రాబిన్, అరుల్‌రాజ్, సేవక్, మరియప్పన్‌గా గుర్తించామని, వీరి నుంచి దొంగిలించిన గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.