ఢిల్లీలో బోరు బావిలో పడ్డ యువకుడు మృతి
దేశ రాజధాని న్యూఢిల్లీ వికాస్ పురి కేషోపూర్ మండిలోని ఢిల్లీ జల్ బోర్డు ప్లాంట్ బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు.
By Medi Samrat Published on 10 March 2024 8:14 PM ISTదేశ రాజధాని న్యూఢిల్లీ వికాస్ పురి కేషోపూర్ మండిలోని ఢిల్లీ జల్ బోర్డు ప్లాంట్ బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు. మొదట పడిపోయింది చిన్నారి అని అనుకున్నారు. అయితే పడింది యువకుడని.. రెస్క్యూ టీమ్ అతడు చనిపోయినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మంత్రి అతిషి అధికారికంగా ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి జల్ బోర్డు ప్లాంట్ బోరు బావిలో ఓ చిన్నారి పడినట్లు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. చనిపోయింది యువకుడని తేలింది.
ఢిల్లీ జల్ బోర్డు మురుగునీటి శుద్ధి కర్మాగారంలోని బోరుబావిలో పడిపోయిన యువకుడి మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెలికి తీయగా, అతను మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉన్నామని పోలీసులు వెల్లడించారు. అంతకుముందు రోజు, నీటి మంత్రి అతిషి సంఘటన జరిగిన కేశోపూర్‌లోని ఢిల్లీ జల్ బోర్డు నీటి శుద్ధి కర్మాగారాన్ని సందర్శించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో బాధ్యులైన అధికారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. "రాబోయే 48 గంటల్లో ఢిల్లీలోని అన్ని బోర్‌వెల్‌లను తనిఖీ చేయాలని నేను ఆదేశించాను. ఈ ఘటనకి కారణమైన అధికారిపై చర్యలు తీసుకుంటాము" అని అతిషి వార్తా సంస్థ PTI కి చెప్పారు. రెస్క్యూ టీమ్‌లు వచ్చినప్పుడు బోర్‌వెల్ చుట్టుపక్కల ప్రాంతం లాక్ చేశారని, యువకుడు ఆ ప్రాంతానికి ఎలా వచ్చాడనే విషయమై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అతిషి తెలిపారు.