యువతి తల్లిదండ్రులు తమ ప్రేమను వ్యతిరేకించడంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఒక యువకుడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. తమిళనాడులోని మింజూర్‌కు చెందిన అజిత్ అనే వ్యక్తి తారామణిలోని ఆ యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. అజిత్ మొబైల్ ఫోన్ రిటైల్ షోరూమ్‌లో కలిసి పనిచేస్తున్న సమయంలో 22 ఏళ్ల యువతి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మరో వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు.
దీంతో కోపోద్రిక్తుడైన అజిత్ తారామణిలోని కనగం ప్రాంతంలో ఉన్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె గొంతుపై దాడిచేశాడు యువకుడు. వీరిద్దరూ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో మహిళ కుటుంబీకులు వచ్చారు. అప్పటికే యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. అజిత్ ఆయుధంతో కనిపించారు. వారిని చూసిన వెంటనే అజిత్ మరో గదిలోకి పరిగెత్తి తాళం వేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. తారామణి పోలీసులు ఇంటికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా అజిత్ ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగారని తారామణి పోలీసులు తెలిపారు.
తన వివాహ ప్రతిపాదనను ఆమె తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో అజిత్ కత్తి పట్టుకుని మహిళను హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అజిత్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.