ఉద్యోగం చేయమ‌ని ఒత్తిడి చేయడంతో భార్య, అన్న‌ను దారుణంగా హత్య చేసిన వ్య‌క్తి

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా ధమోత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాట్‌ఖేడా గ్రామంలో గురువారం తెల్లవారుజామున హృదయ విదారక సంఘటన జరిగింది

By Medi Samrat
Published on : 21 Aug 2025 6:49 PM IST

ఉద్యోగం చేయమ‌ని ఒత్తిడి చేయడంతో భార్య, అన్న‌ను దారుణంగా హత్య చేసిన వ్య‌క్తి

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా ధమోత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాట్‌ఖేడా గ్రామంలో గురువారం తెల్లవారుజామున హృదయ విదారక సంఘటన జరిగింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ కుటుంబంపై దారుణమైన దాడి జరిగినట్లు గ్రామంలో నిద్రిస్తున్న ప్రజలకు సమాచారం అందింది. నిందితుడు ప్రేమ్‌చంద్ తన భార్యను, అన్నయ్యను గొడ్డలితో దారుణంగా హతమార్చడంతో పాటు కొడుకు, మేనల్లుడిపై కూడా దాడి చేశాడు.

నిందితుడు మొదట తన అన్న మూల్‌చంద్ ఇంటికి చేరుకుని అకస్మాత్తుగా గొడ్డలితో దాడి చేసి చంపాడని పోలీసు సూపరింటెండెంట్ బి. ఆదిత్య తెలిపారు. తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన‌ మూల్‌చంద్ కుమారుడు మనోజ్‌పై కూడా దాడి చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన నిందితుడు భార్య సవితను హత్య చేశాడు. ఆ సమయంలో కొడుకు సంతోష్‌పై కూడా దాడి చేశాడు. అయితే సంతోష్ ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

జంట హత్య తర్వాత ప్రేమ్‌చంద్ తన పిల్లల కోసం గ్రామంలో వెతికాడు. కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు గ్రామస్థులు అతని ఉద్దేశాన్ని గ్రహించారు. ప్రజలు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన తర్వాత గ్రామమంతా గందరగోళం నెలకొంది. సంఘటనా స్థలంలో ఎఫ్‌ఎస్‌ఎల్, మొబైల్ యూనిట్ ఆధారాలు సేకరించగా.. ఎస్పీ ఆదిత్య స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు తన భార్య, అన్నయ్యపై ఆగ్రహంతో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉద్యోగం చేయ‌మ‌ని ఇద్దరూ తనపై ఒత్తిడి తెచ్చి వేధించేవారని నిందితుడు విచార‌ణ‌లో తెలిపాడు. ఈ ఒత్తిడి కారణంగానే తాను భయంకరమైన అడుగు వేసిన‌ట్లు వెల్ల‌డించాడు.

నిందితుడు, అతని సోదరుడు 500 మీటర్ల దూరంలో వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో నెట్‌వర్క్ సమస్య కారణంగా పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందింది. ప్రస్తుతం నిందితుడి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ప్రజలు ఇంకా షాక్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Next Story