ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కింద పడ్డ చాక్లెట్‌ను తీసుకోవడమే.. ఆ చిన్నారికి ఆయువు తీరేలా చేసింది. చిన్నారి జీవితాన్ని బస్సు చిదిమేసింది. అన్నను పాఠశాలకు పంపడానికి నాన్నతో పాటు వెళ్లిన ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. కోడూరు చెందిన శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులు. వారికి కుమారులు ఆదిత్య, దినేష్ కుమార్ (3) ఉన్నారు. ఆదిత్య ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మంగళవారం నాడు ఆదిత్య స్కూల్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. తండ్రి శ్రీనివాసరావు.. ఆదిత్యను బస్సు ఎక్కించేందుకు ఇంటి బయటకు వచ్చాడు.
అదే సమయంలో వారి వెనుకనే చిన్నారి దినేష్ కుమార్ కూడా బుడి బుడి అడుగులు వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే చిన్నారి చేతిలో ఉన్న చాక్లెట్ బస్సు వెనుక టైర్ల కింద పడింది. ఆ చాక్లెట్ తీసుకునేందుకు చిన్నారి చక్రాల కిందకు వంగాడు. ఈ విషయాన్ని అక్కడున్న వారు ఎవరూ గమనించకపోగా.. డ్రైవర్ సైతం బస్సును ముందుకు నడిపాడు. దీంతో బస్సు టైర్ల కింద చిన్నారి దినేష్ తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఒక్క క్షణంలో చిన్నారి చనిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే తన కుమారుడి మరణానికి కారణమని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.