తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై 15 మంది విద్యార్ధినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9, 10 తరగతులకు చెందిన కనీసం 15 మంది విద్యార్థునులు తమ పాఠశాలలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో తమకు ఎదురైన కష్టాలను వెల్లడించారు.
గణితం, సాంఘిక శాస్త్రం బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు తరగతి సమయంలో డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారని.. తమను అనుచితంగా తాకారని.. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఫోన్‌లకు కూడా కాల్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సోషల్ సైన్స్ టీచర్‌ను అరెస్ట్ చేసి రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు. విద్యార్థినుల ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విచారణ చేపట్టారు.