దేశ రాజధాని న్యూఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో గల చెప్పుల ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో.. పక్కనే ఉన్న మరో యూనిట్‌కు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
"ఉదయం 9.05 గంటలకు మంటల గురించి మాకు కాల్ వచ్చింది. వెంటనే నాలుగు ఫైర్ టెండర్లను తరలించారు. మంటలు పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి కూడా వ్యాపించడంతో, మొత్తంగా, మా 20 ఫైర్ టెండర్లు స్పాట్‌లో మోహరించబడ్డాయి" అని డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ద్వారా మంటలు అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. అగ్నిమాపక శాఖ ప్రకారం.. మంటలు చెలరేగిన పాదరక్షల కర్మాగారంలో బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తుల భవనం ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకుంటున్నామని వారు తెలిపారు.