ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. తనపై స్నేహితులు కుల దూషణలకు దిగడంతో.. వికలాంగుడైన ఆవ్యక్తి అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిని అతని స్నేహితులు హత్య చేశారు. నిందితులు నవంబరు 21న ఘజియాబాద్‌లో ఆ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి, కత్తెరతో పొడిచి చంపారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
ఏం జరిగిందంటే..
మృతుడు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా హర్బన్స్ నగర్ కాలనీలో నవంబర్ 21న ఈ ఘటన జరిగింది. మృతుడు సచిన్‌గా గుర్తించారు. బాధితుడు తన స్నేహితులతో కలిసి హర్బన్స్ నగర్ ప్రాంతంలో కలిసి ఉన్నప్పుడు.. వారు అతని కులం గురించి దుర్భాషలాడారు. ఇదే విషయమై అతడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు అతడిని హత్య చేశారు. సాక్ష్యాలను చెరిపివేయడానికి, వారు మృతదేహాన్ని చెత్త కుప్పపై ఉంచి ఇంధనంతో నిప్పంటించారు. అయితే మృతుడు బయటకు వెళ్లి ఎంతకూ తిరిగిరాకపోవడంతో అతడి సోదరులు ఆందోళనకు గురయ్యారు. అతడి కోసం ఎంత గాలించిన ఆచూకీ లభించలేదు.
కాగా శుక్రవారం నాడు మృతుడి సోదరులు సందీప్, విశాల్ ఒక ఖాళీ ప్రదేశంలో కాలిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ దుస్తులు తమ సోదరుడివిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వివేక్, రవి, సచిన్, సౌరభ్‌లుగా గుర్తించినట్లు సర్కిల్ ఆఫీసర్ అవినాష్ కుమార్ తెలిపారు. సచిన్‌ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. సచిన్‌ను పట్టుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.