ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఆ మృతదేహాలు దంపతులవని తెలుస్తోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండు మృతదేహాలు లభ్యమైనట్లు రామచంద్రాపురం పోలీసులు వెల్లడించారు. దంపతులు మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మృతులది తమిళనాడు తిరుత్తణి అని పోలీసులు వెల్లడించారు.
ఈ దంపతులపై నాలుగు రోజుల క్రితం తమిళనాడు తిరుత్తణి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. దుండగులు దంపతులను చంపి మృతదేహాలను చిత్తూరులోని చిట్టత్తూరు అడవుల్లో పడేసినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. మృతులు సంజీవరెడ్డి (60), మాల (60) గా తమిళనాడు తిరుత్తణి పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనకు కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పరిధిలోని అడవుల్లో మృతదేహాలను పడేయడం సంచలనంగా మారింది.