బీజేపీ మహిళా నేతపై గ్యాంగ్ రేప్
BJP woman leader Sexual Assaulted by culprits. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహిళా బీజేపీ నాయకురాలిపై సామూహిక అత్యాచారం
By Medi Samrat Published on 23 Dec 2021 7:38 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహిళా బీజేపీ నాయకురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు యువకులపై కేసు నమోదైంది. బాధితురాలు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలని తేలింది. ప్రధాన నిందితుడిని అబ్దుల్లాగా గుర్తించారు. రెండు వర్గాలకు చెందిన కేసు కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన మంగళవారం (డిసెంబర్ 21) జరిగినట్లు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. ఈ కేసు ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని హాపూర్ రోడ్‌లోని కాశీరామ్ కాలనీలో చోటు చేసుకుంది. అత్యాచార ఘటన రాత్రి 8 గంటల సమయంలో చోటు చేసుకుందని భావిస్తున్నారు. బాధితురాలు ముగ్గురు పిల్లల తల్లి అని తెలుస్తోంది.
బాధితురాలికి అబ్దుల్లా ముందే తెలుసునట..! అతడు తన ఇద్దరు సహచరులతో కలిసి ఆమెకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. బీజేపీ నాయకురాలు అపస్మారక స్థితిలో ఉండగానే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం పార్కులో అపస్మారక స్థితిలో కనిపించింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మహిళా నాయకురాలు స్పృహలోకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు మీరట్ ఎస్‌ఎస్పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు.