విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిదన్న కోపంతో ఓ యువకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. శనివారం రాత్రి ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నంకు చెందిన ఓ యువతి (20), తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ రెడ్డి (21) పంజాబ్‌లో గత సంవత్సరం బీటెక్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో హర్షవర్ధన్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సదరు యువకుడు విశాఖ వెళ్లాడు. అక్కడే ఓ హోటల్ రూమ్ తీసుకున్నాడు. తాను విశాఖకు వచ్చిన సమాచారాన్ని యువతికి అందించాడు. దీంతో యువతి కూడా శనివారం హోటల్‌కు వచ్చింది.
ఈ క్రమంలోనే హర్షవర్ధన్ రెడ్డి తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతిని కోరాడు. ఈ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. దీంతో ఆవేశానికి గురైన యువకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇద్దరికి మంటలు అంటుకోవడంతో హోటల్ నుండి పొగతో కూడిన మంటలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతికి 61 శాతం, యువకుడికి 62 కాలిన గాయాలు అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.