తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో బుధవారం ఒక బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు ధాటికి ఎనిమిది మంది మరణించగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు సంభవించినప్పుడు ఫ్యాక్టరీలో 25 మంది పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. భారీ పేలుడు కారణంగా భవనం కూలిపోయిందని.. చాలా మంది లోపల చిక్కుకున్నారని తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డీజీపీ అభాష్ కుమార్ ని ఉటంకిస్తూ ఓ నివేదిక పేర్కొంది.
కాంచీపురం జిల్లా పోలీసులు, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది, స్థానిక నివాసితులతో కలిసి అగ్నికి ఆహుతైన భవనం నుండి మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాణసంచా యూనిట్‌కు లైసెన్స్ ఉందని, అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని డీజీపీ అభాష్ కుమార్ తెలిపారు. కాలిన గాయాలైన క్షతగాత్రులను వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.