ప్రాణం తీసిన ఈత సరదా.. ఏడుగురు బాలికలు మృతి
7 girls drown in 15-ft-deep pit near dam in Tamil Nadu. తమిళనాడులోని కడలూరు సమీపంలోని చెక్ డ్యామ్ వద్ద ఈత కొట్టడానికి
By Medi Samrat Published on 6 Jun 2022 2:01 PM IST
తమిళనాడులోని కడలూరు సమీపంలోని చెక్ డ్యామ్ వద్ద ఈత కొట్టడానికి వెళ్లిన ఏడుగురు బాలికలు నీటిలో మునిగి చనిపోయారు. అందరూ 18 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు గలవారు. ఇరుగుపొరుగు వాళ్లు, స్నేహితులు అందరూ కలిసి జూన్ 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు గెడ్డిలం నదికి అడ్డంగా ఉన్న చెక్ డ్యాం వద్ద నీటిలోకి దిగగా.. బాలికలు మునిగిపోయి మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను ఎ మోనిషా (16), ఎం నవనీత (18), కె ప్రియ (18), ఎస్ సంగవి (16), ఆర్ దివ్య దర్శిని (10), ఆమె సోదరి ఆర్ ప్రియదర్శిని (16), ఎం కుమ్ముధ (18)గా గుర్తించారు. వీరంతా తమిళనాడులోని కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని కూచిపాళ్యం గ్రామానికి చెందినవారు. కడలూరు జిల్లాలోని నెల్లికుప్పం సమీపంలో ఉన్న కూచిపాళయం గ్రామం సమీపంలో ప్రవహించే గెడ్డిలం నదిపై ఈ ఆనకట్ట నిర్మించబడింది. డ్యామ్‌లో నీరు నిలిచిపోవడంతో ఆదివారం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో చాలా మంది నదిలో స్నానాలు చేసేందుకు డ్యామ్ దగ్గరకు వెళ్లారు. మొదట ఇద్దరు అమ్మాయిలు మునిగిపోవడం ప్రారంభించగా.. ఇతరులు వారిని రక్షించే ప్రయత్నంలో మరణించారు. కడలూరులోని ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాలికలను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం కడలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి MRK పన్నీర్‌సెల్వం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నీటి వనరులు, ప్రమాదకరమైన ప్రదేశాలలో స్నానాలు చేయడం ద్వారా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని స్థానిక ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏడుగురు బాలికల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుండి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.